
తెనాలి: నటుడు, దర్శకుడు, రచయిత, నాటకరంగ పరిశోధకుడు, ఆచార్యుడు ‘కళారత్న’ మొదలి నాగభూషణశర్మ (84) మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో కన్నుమూశారు. నాజరు పేటలోని మల్లాదివారి వీధిలో నివసిస్తున్న నాగభూషణశర్మ, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఆయనకు ఇద్దరు కుమారులు. బుధవారం సాయంత్రం బుర్రిపాలెం రోడ్డులోని శ్మశానవాటికలో ఆంత్యక్రియలు నిర్వహించారు.
ఆయన సతీమణి సరస్వతి 2015లో మృతిచెందారు. ఏపీ నాటక అకాడమీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, వివిధ కళాసంస్థల నిర్వాహకులు, కళాకారులు నాగభూషణశర్మ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏడు పదుల కాలం తన జీవితాన్ని నాటకకళ, నాటక రచన, పరిశోధన, బోధనకు అంకితం చేసిన నాగభూషణశర్మ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేస్తూనే నాటకకళపై అభిరుచితో, అమెరికా వెళ్లి మాస్టర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ (థియేటర్) చేశారు. నాటకరంగ సేవలకుగానూ ఈనెల 6న తెనాలిలో అజో–విభొ–కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు.