అనంతపురం కార్పొరేషన్ :
అనంతపురం నగరంలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) తీసుకొస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే యూజీడీ రావాలంటే... ప్రాజెక్టులో కీలకంగా ఉన్న మురికినీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలి. ఇదే ఇప్పుడు యూజీడీ ప్రాజెక్టుకు కీలక అడ్డంకిగా మారింది. స్థల సేకరణ జరగకపోతే యూజీడీ మంజూరు కాదు. ఈ విషయం ఇటు ప్రజాప్రతినిధులకు, అటు అధికారులకు తెలియంది కాదు. స్థల సేకరణ జరగనిదే ప్రాజెక్టు రాదని తెలిసి కూడా తెస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధులు ఈ విషయంలో ప్రజలకు ‘క్లారీటీ’ ఇవ్వాల్సి ఉంది.
అనంతపురం నగరంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.368.08 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ తయారు చేయడమే కాకుండా ఇందుకు సంబంధించి చెక్‌లిస్ట్‌ను ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించి ఏడాదిన్నర గడుస్తోంది. ప్రాజెక్టు మంజూరులో కీలకంగా ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలం సేకరణపై దృష్టి పెట్టకపోవడమే ప్రాజెక్టు రాకకు గ్రహణంగా మారనుంది .
స్థలం సేకరించాల్సి ఉంది. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)-2 కింద అనంతపురం కార్పొరేషన్‌ను చేర్చింది. దీని ద్వారా నిధులు మంజూరు అవుతాయి. భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు సంబంధించి నగ రాన్ని తొమ్మిది జోన్‌లుగా విభజించారు. ఈ తొమ్మిది జోన్‌లలో భూగర్భ డ్రై నేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.318.10 కోట్లుగా అంచనాలు తయారు చేశారు. రోజుకు 60 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం కోసం రూ.16.97 కోట్లు అంచనా వేశారు.
జాకింగ్ కోసం రూ.3.69 కోట్లు, మురుగునీటిని శుద్ధి చేసే పరికరాలకు రూ. 54 లక్షలుగా అంచనాలు సిద్ధం చేశారు. ఏడేళ్ల పాటు నిర్వహణకు రూ.6.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కంటింజెన్సీ ఖర్చులు 3 శాతంగా రూ.10.38 కోట్లు అంచనా వేశారు. మురుగునీటి శుద్ధం ప్లాంట్ నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించేందకు రూ.4 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. భూగర్భ డ్రై నేజీ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర సర్వే, డిజైన్ సిద్ధం చేసేందుకు రూ.61.06 లక్షలు, ఏడేళ్ళ విద్యుత్ చార్జీలకు రూ.7.08 కోట్లు ఖర్చు అవుతుందని చెక్‌లిస్ట్‌లో ఉంచారు. మొత్తంగా ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.368.08 కోట్లు అంచనా వ్యయంగా చూపించారు.
శుద్ధి ప్లాంట్‌కు భూసేకరణ ప్రధానం
భూగర్భ డ్రై నేజీ ఏర్పాటులో అత్యంత కీలకమైనది మురుగునీటి శుద్ధి ప్లాంట్. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అసవరమైన స్థలాన్ని సేకరించాలి. దీంతో బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లె సమీపంలో 230 ఎకరాలు భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో కొంత ప్రభుత్వ స్థలం కాగా దాదాపు 130 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.4 కోట్లు అవుతుందని అంచనా కూడా వేశారు.
శుద్ధి ప్లాంట్ నిర్మాణం కోసం భూమిని సేకరించి సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ డాక్యుమెంట్‌ను, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తేనే ప్రాజెక్టు మంజూరవుతుంది. లేకపోతే ఇవ్వదు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం-1 మొదటి విడతలో కొన్ని కార్పొరేషన్‌లకు ఇదే పరిస్థితి ఏర్పడింది. శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు భూమిని సేకరించని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆక్కడ ప్రాజెక్టును మంజూరు చేయలేదు. ఇక్కడా మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు భూమిని సేకరించాల్సి ఉంది కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పాలకవర్గం చొరవ చూపాలి
నగరానికి భూగర్భ డ్రైనేజీ ఆవశ్యం ఎంతో ఉంది. ఈ విషయంపై పాలకవర్గం చొరవ చూపిస్తే తప్ప ప్రక్రియ ముందుకు కదలదు. ప్రాజెక్టులో కీలకమైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలి. కేవలం రూ.4 కోట్లకు చూసుకుని స్థల సేకరణ జరపకపోతే ఏకంగా రూ.368 కోట్ల ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోతుందనేదాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. అదే జరిగితే భవిష్యత్తులో మళ్ళీ ప్రాజెక్టుని మంజూరు చేయించుకోవడం అంత సులవైన పనికాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
భూగర్భ డ్రెయినేజీకి అడ్డంకులెన్నో?
Published Wed, Nov 5 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement