ఎత్తిపోతే?
అనంతపురం అగ్రికల్చర్ : కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య రేగిన వివాదం సద్దుమణగడం లేదు. దీంతో హంద్రీ-నీవాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘అనంత’కు కన్నీళ్లు మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సమయంలో చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటికి సైతం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం రిజర్వాయర్‌లోని మిగులు జలాలపై హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ఆధారపడి ఉంది.
ఇప్పటి వరకు తొలి దశ మాత్రమే పూర్తి చేసుకున్న హంద్రీ-నీవా ద్వారా ఎత్తిపోతలతో కర్నూలు, అనంతపురం జిల్లాలకు కృష్ణా జలాలను తీసుకొస్తున్నారు. కర్నూలు జిల్లాలో క్రిష్ణగిరి, పత్తికొండ జలాశయాలతో పాటు, జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. మూడేళ్ల నుంచి కృష్ణా జలాలు హంద్రీనీవా ద్వారా జిల్లాకు వస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో గతేడాది నుంచే వస్తున్నాయి. గతేడాది దాదాపు 6 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి.
ఈ ఏడాది కూడా 10 టీఎంసీలు వచ్చే అవకాశముందని అధికారులు భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలంలో కనీస నీటిమట్టం పడిపోతున్నా కిందకు వదులుతూనే ఉంది. ప్రస్తుతం జలాశయంలో 857 అడుగులు నీటిమట్టం ఉన్నట్లు సమాచారం. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చే యకుండా కొనసాగిస్తోంది.
830 అడుగుల వరకూ కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే జరిగితే శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకోవడానికి కుదరదు. ఇప్పటి వరకు 5.5 టీఎంసీల వరకూ నీటిని తీసుకున్నాం. తొలుత అధికారులు భావించిన విధంగా హంద్రీనీవాకు 10 టీఎంసీలకు పైగా నీరు వచ్చింటే జిల్లాలో నీటి ఇబ్బందులు తలెత్తేవి కావు. ఈ సమయంలో ఇరు రాష్ట్రాలు తీసుకునే నిర్ణయంపైనే జిల్లా రైతుల భవిష్యత్ అధారపడి ఉంది. ఈ సమయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చిత్తశుద్దితో వ్యవహరించి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.
తుంగభద్ర లోటును తీరుస్తున్న కృష్ణమ్మ
తుంగభద్ర జలాశయంలోకి ప్రతి ఏటా పూడిక వచ్చి చేరుతోందని సాకు చూపి హెచ్చెల్సీ కోటాలో భారీగా కోత విధిస్తున్నారు. నికరంగా 32 టీఎంసీలు జిల్లాకు రావాల్సి ఉన్నా కొన్నేళ్లుగా 22 టీఎంసీలు మించి జిల్లాకు రావడం లేదు. దీంతో హెచ్చెల్సీ కింద ఉన్న ఆయకట్టు బీడుగా మారుతోంది. ఈ ఏడాది కూడా హెచ్చెల్సీకి 22 టీఎంసీలు కేటాయించారు. ఏడాదికేడాది తుంగభద్రపై ఆశలు వదులుకునే పరిస్థితిలో హంద్రీ-నీవా ఆదుకుంటుందనే భరోసా పెరిగింది.
అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఈనరు రాకపోవడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. హెచ్చెల్సీతో పాటు, హంద్రీ-నీవాకు వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాణాళికలు రచించుకున్నారు. ఈ ఏడాది తాగునీటి అవసరాల కోసం 8.50 టీఎంసీలు నిల్వ చేసుకొని.. 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని భావించారు. దీంతో పీఏబీఆర్ కుడి కాల్వ కింద ఉన్న 49 చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు.
హెచ్చెల్సీ కింద మరో 20కి పైగా చెరువులను నింపాల్సి ఉంది. దీనికి తోడు చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. ఈ పరిస్థితిలో శ్రీశైలం జలాలు సముద్రం పాలవుతుండటం అగమ్య గోచరంగా తయారవుతోంది. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం పడిపోయి.. హంద్రీ-నీవాకు నీటి విడుదల ఆగిపోతే జిల్లా వాసులు తాగునీటికి సైతం ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.