సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నార’న్నట్లుగా తయారైంది ప్రభుత్వ వైఖరి. మూడేళ్లపాటు పైసా నిధులను విదల్చకపోవడం వల్ల జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి ప్రజల ఓట్లు గుర్తుకొచ్చాయి. జేసీ నాగిరెడ్డి పథకం పనులను పర్యవేక్షించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ(ఇంజనీర్-ఇన్-చీఫ్) నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. గతంలో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం పరిధిలోకి రాని శింగనమల నియోజకవర్గంలోని 73 గ్రామాలకు అదే పథకం నుంచి నీటిని అందించేందుకు రూ.40 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పుడు జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం నుంచి కాకుండా మిడ్ పెన్నార్ డ్యామ్ నుంచి శింగనమల నియోజకవర్గంలోని 73 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.150 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో ఆర్‌టీ నెం: 1895) జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లోని 561 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లోని ప్రజలకు రోజుకు తలసరి 70 లీటర్ల నీటిని అందించేందుకు రూ.508 కోట్ల వ్యయంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు.
ఇందుకు అవసరమైన జలాలను వైఎస్సార్ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా ఈ పథకంలో రూ.396.16 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇందులో రూ.350 కోట్ల విలువైన పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయినవి కావడం గమనార్హం. ఈ మూడేళ్లలో కేవలం రూ.46 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. ఇందులో రూ.40 కోట్లకుపైగా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో ప్రభుత్వం బకాయి పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. మూడేళ్లుగా ఇదే దుస్థితి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..
రూ.396.16 కోట్లను ఖర్చు చేసినా ఒక్క గ్రామానికి కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. జేసీ నాగిరెడ్డి పథకంపై ప్రభుత్వ వైఖరి విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలు తమకు ఇబ్బందిగా మారుతాయని అధికార పార్టీ నేతలు భావించారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దాంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. తక్కిన రూ.111.84 కోట్ల విలువైన పనులను వేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు.. ప్రస్తుతం పూర్తయిన పనుల పరిస్థితిని పరిశీలించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమగ్రమైన నివేదిక తయారుచేసి.. పనులను పర్యవేక్షించేందుకు ఈఎన్‌సీ నేతృత్వంలో విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈ, స్టేట్ ప్లాన్ సీఈలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమించింది.
అంచనా వ్యయం రూ.110 కోట్లు పెంపు..
జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం కింద శింగనమల నియోజకవర్గంలోని 76 గ్రామాలు కవర్ కావడం లేదు. ఆ గ్రామాలకు జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం నుంచే నీటిని అందించడానికి 2012లో రూ.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గండికోట రిజర్వాయర్ నుంచి జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకానికి సరిపడా జలాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని.. శింగనమల నియోజకవర్గం పరిధిలోని 76 గ్రామాలకు ఆ పథకం నుంచి నీళ్లందించడం కష్టమవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రమణమూర్తి అక్టోబరు 11న ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదికను పరిశీలించిన ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ.. ఎంపీఆర్ డ్యామ్ నుంచి శింగనమల నియోజకవర్గం పరిధిలోని 76 గ్రామాలకు తాగునీటిని అందించాలంటూ అక్టోబరు 22న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎంపీఆర్ డ్యామ్ నుంచి 76 గ్రామాలకు తాగునీటిని అందించడానికి రూ.150 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ డీపీఆర్‌పై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. శింగనమల నియోజకవర్గంలోని 76 గ్రామాలకు ఎంపీఆర్ డ్యామ్ నుంచి తాగునీటిని అందించడానికి రూ.150 కోట్లతో ప్రత్యేక పథకాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. శింగనమల తాగునీటి పథకం అంచనా వ్యయం రూ.40 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెరిగినట్లు స్పష్టమవుతోంది.
ఎంపీఆర్ డ్యాం నుంచి శింగనమల నియోజకవర్గానికి తాగునీరు
Published Tue, Nov 26 2013 2:16 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement