కొనసా..గుతున్న డ్రిప్ అమరిక
అనంతపురం అగ్రికల్చర్ : బిందు పరికరాల ఏర్పాటు కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. గతేడాది(2015-16)లో మంజూరు చేసిన డ్రిప్ యూనిట్లు రైతుల పొలాల్లో బిగించడం ఆలస్యమవుతోంది. మార్చి 31వ తేదీ వరకు మంజూరు చేసిన వాటిని ఏప్రిల్ నెలాఖరులోగా పొలాల్లో బిగిస్తామని ప్రకటించారు. కానీ.. ఇంకా 40 శాతం మంది రైతులు ఎదురుచూస్తున్నారు. గతేడాది 22,645 మంది రైతులకు సంబంధించి 23,184 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు మంజూరు చేశారు. మంజూరులో రాష్ట్రంలో ‘అనంత’ అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో చిత్తూరు జిల్లా 15,914 హెక్టార్లకు ఇచ్చారు.
అయితే ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంలో వెనుకబడ్డారు. ఏపీఎంఐపీ పీడీ, ఏపీడీలు వెంటపడుతున్నా.. మెటీరియల్ సరఫరా కాకపోవడం, వేసవితో రైతులు కూడా బిగించుకునేందుకు కొంత వెనుకాడుతుండటంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వారం వారం సమీక్షలో ఇన్‌స్టాలేషన్‌కు అధికారులు గడువు మీద గడువు పొడిగిస్తున్నా పూర్తీ కాని పరిస్థితి నెలకొంది. మొదట ఏప్రిల్ 31 అన్నారు. తర్వాత మే 10 తేదీకి పెంచారు. ఇపుడు మే నెలాఖరుకు పొడిగించారు. శనివారం నాటికి 14,332 మంది రైతులకు 14,803 హెక్టార్లలో డ్రిప్ పరికరాలు బిగింపు పూర్తయింది. ఇంకా 8,313 మంది రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాల్సి ఉంది. జూన్ నుంచి కొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మే నెలాఖరుకు వంద శాతం పూర్తీ కావడం కష్టంగానే కనిపిస్తోంది.
ఈనెలాఖరుకు వంద శాతం పూర్తీ చేయాలని కంపెనీలు, ఎంఐఏఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. లేదంటే మంజూరైన డ్రిప్‌ను రద్దు చేయడానికి వెనుకాడబోమన్నారు. ఇకపోతే ప్రస్తుత 2016-17లో 42 వేల మంది రైతులకు 35 వేల హెక్టార్లకు డ్రిప్ ఇవ్వాలని లక్ష్యంగా ఇచ్చారు. అందులో ప్రస్తుతానికి 473 మంది రైతులకు 482 హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు మంజూరు చేశారు. ఇంకా బిగించడం మొదలు కాలేదు. కాగా మీ-సేవా కేంద్రాల్లో ప్రస్తుతం 32,985 హెక్టార్లకు డ్రిప్ కావాలంటూ 25,225 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.