మద్దిలపాలెంలోని నగర కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్
సాక్షి, విశాఖ సిటీ: ‘వీఎంఆర్‌డీఎ ద్వారా ప్రజలకు మేలు కలిగే పనులు జరగాలి. సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమం పూర్తిగా ప్రజామోదంతోనే జరగాలి. ప్రతి పని అవినీతిరహితంగా ఉండాలి.. ప్రతి అడుగు పారదర్శకంగా పడాలి’... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిశానిర్దేశమిది. అందుకు తగ్గట్టే విశాఖ నగరం కేంద్రంగా నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ప్రతిష్టాత్మక సంస్థ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థ ద్వారా ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్దమవుతోంది. ఇందుకు నిదర్శనంగా గత పదేళ్లుగా (వుడాగా ఉన్న సమయంతో కలిపి) ఖాళీగా ఉన్న పాలక బోర్డును ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంస్థ చైర్మన్‌గా అనుభవజ్ఞుడు, వివాద రహితుడు.. గత ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. అతిత్వరలో బోర్డులో మిగిలిన పదవులు కూడా భర్తీ కానున్నాయి. చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
ల్యాండ్ పూలింగ్‌తో పాతాళానికి
నాలుగు దశాబ్దాల క్రితం 1978లో విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా) ప్రారంభమైంది. ఈ ప్రస్థానంలో వుడా ఆధ్వర్యంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అటు ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా దండిగా ఆదాయం సమకూరేది. అయితే ఈ క్రమంలో వుడా చరిత్రలో కొన్ని మచ్చలు, మరకలు కూడా తలెత్తాయి. పదేళ్లుగా ఈ సంస్థకు సరైన మార్గనిర్దేశనం లేదు. ముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఓ దశలో సంస్థ తిరోగమనంలో పయనించింది. ఈ క్రమంలో 2014లో టీడీపీ అధికారం చేపట్టాక వుడా పూర్తిగా ఆ పార్టీ జేబు సంస్థగా మారిపోయింది. నగరంలో అనేక భూములపై కన్నేసిన టీడీపీ పెద్దలు, అనుయాయులు నిబంధనలకు విరుద్ధంగా పేదల భూములు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు. తాము చేస్తున్నది నిబంధనల ప్రకారమే అన్న రంగు పూసేందుకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. అమరావతి తరహాలో ఇక్కడ వుడా(వీఎంఆర్డీఎ)ను వాడుకుని భూ సమీకరణకు పాలకులు తెగించారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా సంస్థ ప్రతిష్ట మసకబారింది. మరోవైపు 2018లో వుడా పరిధిని విస్తరించిన టీడీపీ ప్రభుత్వం వీఎంఆర్‌డీఎగా మార్పుచేసింది. కానీ చైర్మన్ పదవిని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వద్దే ఉంచుకుని తమ అనుచరులతో సంస్థను నడిపించారు. సంస్థ పరిధిని పెంచారే తప్ప ప్రతిష్టను పెంచే కార్యక్రమం ఒక్కటీ చేయలేదు.
పరిధి విస్తృతం.. పనులు ప్రత్యేకం
► విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఎ) విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాళుళం, తూర్పుగోదావరి (ఉత్తరకోస్తా) జిల్లాల్లో విస్తరించి ఉంది. వుడాగా ఉన్న సంస్థ ఆయా జిల్లాలను కలుపుకుని 2018 సెప్టంబర్ 5న వీఎంఆర్‌డీఎగా రూపాంతరం చెందింది. సంస్థ డెవలప్‌మెంట్ పరిధి మొత్తం 4,873 కిలోమీటర్లు.
► వీఎంఆర్డీఎ కమిషనర్‌కు రూ.కోటి విలువైన పనులకు మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రూ.కోటి నుంచి 10 కోట్ల వరకు అభివృద్ధి పనులకు అనుమతి ఇచ్చే వెసులుబాటు ఉంది. అదే బోర్డు నియామకం జరిగితే రూ.100 కోట్ల పనులకు అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. రూ.100 కోట్లకు పైగా అనుమతిని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది.
► ప్రస్తుతం సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌గా జీవీఎంసీ కమిషనర్ జి.సృజన ఉన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ తొలి చైర్మన్‌గా చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను నియమించింది. వుడా తొలి చైర్మన్‌గా శ్రీనివాస్ తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ సరిగ్గా 40 ఏళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించడం విశేషం.
పారదర్శకతే ప్రామాణికం
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వీఎంఆర్‌డీఎపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సంస్థను ప్రక్షాళన చేసే దిశగా పదేళ్లుగా ఖాళీగా ఉన్న చైర్మన్ పదవిని కేవలం 40 రోజుల్లో భర్తీ చేశారు. చైర్మన్‌గా నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న సమయంలో పారదర్శకతే ప్రామాణికంగా సంస్థను నడపాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా ముందుగా సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకా రం భవిష్యత్తులో వీఎంఆర్‌డీఎ సంస్థ అత్యున్నతస్థితికి చేరుకుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నేడుచైర్మన్ బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం పదకొండున్నరకు సిరిపురంలోని వుడా చిల్డ్రన్ థియేటర్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం నగరంలోని వీఎంఆర్‌డీఎ భవనంలోని 3వ అంతస్తులోని చైర్మన్ చాంబర్‌లో ద్రోణంరాజు బాధ్యతలు స్వీకరిస్తారని సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ జి.సృజన తెలిపారు. అనంతరం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ ఓ ప్రకటనతో తెలిపారు.
భారీగా తరలిరండి.. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ పిలుపు
సాక్షి, విశాఖపట్నం: విఎంఆర్‌డీఏ చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా నగరవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు కార్యక్రమానికి హాజరు కావాలని ఆపార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో ద్రోణంరాజు శ్రీనివాస్‌తో సహా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యహ్నం 12 గంటలకు సిరపురంలో గల వీఎంఆర్‌డీకు చెందిన వుడా చిల్డ్రన్ ఎరీనాలో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. 1.10 గంటలకు వీఎంఆర్‌డీఏ కార్యలయానికి వెళ్తారని, అనంతరం నగర పార్టీ కార్యలయానికి చేరుకుని పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, సమన్వయకర్తలు కె.కె రాజు, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బెహారా భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, నడింపల్లి కృష్ణంరాజు, మొల్లి అప్పారావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వామనరావు, వుడా మాజీ చైర్మన్ పీఎస్‌ఎన్ రాజు, నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు కాళిదాస్‌రెడ్డి, రాధా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment