
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వీఆర్‌ఎండీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్ మృదుభాషి అని నివాళులర్పించారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు కుటుంబం కీలకపాత్ర పోషిస్తూ వచ్చిందన్నారు. శ్రీనివాస్ మరణం తనకు ఎంతో హృదయవేదన కలిగించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.
ఉత్తరాంధ్రలో పార్టీకి నష్టం
శ్రీనివాస్ మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్రలో తమ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ మరణంతో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్రలో ప్రజాబలం కలిగిన నాయకుడిని కోల్పోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ మృతిపట్ల ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. విశాఖలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, పార్టీ నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఘనంగా నివాళులర్పించారు.