
సాక్షి, అమరావతి : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటు అని పేర్కొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. (చదవండి : మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత)
మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాసరావు మరణం పట్ల మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శెట్టి పాల్గుణతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఎమ్మెల్యేగా, ఎంఆర్ డిఎ ఛైర్మన్ గాను ఆయన తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. శ్రీనివాస్ అకాల మరణం విశాఖ ప్రజలకు తీరని లోటని వైఎస్సార్‌సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ద్రోణంరాజు కుటుంబంతో ఎనలేని అనుబంధం ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు.