దీపావళిలోగా ఐఆర్ చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరాయి. ఎన్నోరోజులుగా పెండింగ్‌లో ఉన్న పదో పీఆర్సీ అమలు, హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని విన్నవించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం వేర్వేరుగా సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సమాఖ్య, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ, యునెటైడ్ టీచర్స్ ఫెడరేషన్, రాష్ట్రోపాధ్యాయ సంఘం తదితర సంఘాల నేతలు వీరిలో ఉన్నారు.
మధ్యంతర భృతి (ఐఆర్), వేతన సవరణ కమిటీ (పీఆర్సీ), హెల్త్‌కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సంబంధిత డిమాండ్లపై సీఎం పూర్తి సానుకూలంగా స్పందించినట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 50 శాతం మధ్యంతర భృతిని దీపావళిలోగా చెల్లించాలని ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ నేత అశోక్‌బాబు డిమాండ్ చేశారు. 2008లో తొమ్మిదో పీఆర్సీ వేసిన మూడు నెలల్లోగానే (అక్టోబర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో) ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ చెల్లించిందని, ఇప్పుడు కూడా అక్టోబర్ నెలలోనే చెల్లించాలని అన్నారు. పీఆర్సీని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేసిన 66 రోజుల సమ్మె కాలాన్ని డ్యూటీ పీరియడ్‌గా క్రమబద్ధీకరించాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. సమ్మెపై హైకోర్టులో ఉన్న కేసు విషయమై కూడా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఉద్యోగులపై సానుభూతి ప్రదర్శించాలని విన్నవించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.
హెల్త్‌కార్డుల అంశంలో ప్రభుత్వం తమతో చర్చిస్తున్న అంశాలకు, డ్రాఫ్ట్‌లో పొందుపరుస్తున్న అంశాలకు పొంతన లేదని, తాము సూచించిన అంశాలు డ్రాఫ్ట్‌లో లేకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎస్టీయూ నేత కత్తి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కాగా ఉద్యోగుల డిమాండ్లను వారం రోజుల్లో పరిష్కరించాలని, 45 శాతం ఐఆర్‌ను వెంటనే చెల్లించాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు యు.మురళీకృష్ణ కోరారు. సకలజనుల సమ్మె వల్ల తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు, సమైక్యాంధ్ర సమ్మె వల్ల సీమాంధ్ర ఉద్యోగులు 66 రోజుల జీతాలను నష్టపోయారని, వీరి పట్ల సానుభూతితో వీలైనంత ఎక్కువ భృతి వెంటనే చెల్లించాలని ఉపాధ్యక్షుడు నరేందర్‌రావు విన్నవించారు. ఇలావుండగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఉద్యోగులు తమ అభిప్రాయాలు, సమస్యలను విన్నవించుకునేందుకు వీలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను రాష్ట్రపతి, ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రవిభజనకు పూనుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.