కరువు దరువు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎండుతున్న పంటలు
అయినా తూతూ మంత్రంగా కరువు మండలాల ఎంపిక
కరువు జిల్లాల జాబితాలో కృష్ణాకు దక్కని స్థానం
జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పడని నాట్లు
మొక్కుబడి నివేదికలతో గుంటూరులో పెరగని మండలాలు
వలస వెళుతున్న కూలీలు.. కబేళాకు తరలుతున్న పశువులు
విజయవాడ/సాక్షి ప్రతినిధి, గుంటూరు : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరువు కోరలు చాస్తోంది. పండిన పంటలను బీళ్లు చేస్తోంది. నిత్యం కృష్ణా నది పరవళ్లతో సుభిక్షంగా కళకళలాడే డెల్టా ప్రాంతం సైతం కళావిహీనంగా మారింది. ఎండిపోతున్న పంటలతో నెర్రెలిచ్చిన బీళ్లు అన్నదాతలను భయపెడుతున్నాయి. కళ్లముందే పంటలు ఎండుతున్నా దిక్కులేక దీనంగా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుగాలం శ్రమించే అన్నదాతలను ఆపద సమయంలో ఆదుకోవాల్సిన సర్కార్ బాధ్యతారాహిత్యంతో నిర్లక్ష్యంగా వదిలేసింది. చివరకు కరువు మండలాల జాబితాలో అయినా చోటిచ్చి అన్నదాతలను ఆదుకునే ప్రయత్నం కూడా చేయకుండా రైతులను అవమానించింది. ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు రెండుజిల్లాల అన్నదాతలు చేసేదిలేక ఆశగా ఆకాశంవైపు.. దీనంగా ప్రభుత్వంవైపు చూస్తున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలో 1.70లక్షల ఎకరాల్లో నాట్లు పడకపోగా, పడినచోట పంటలు ఎండిపోయే దుస్థితి కళ్లకు కడుతున్నా ఈ జిల్లాలో అసలు కరువు మండలమే లేదని ప్రభుత్వం తేల్చేసింది. అటు గుంటూరులోనూ అంతే. రెండో విడత కరువు మండలాల జాబితాలో ఒక్క మండలానికీ చోటు దక్కలేదు.
గుంటూరులో గగ్గోలు...
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ప్రకటించిన కరువు మండలాల జాబితాలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక్క మండలం కూడా లేకపోవడం వ్యవసాయంపై ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపును స్పష్టం చేస్తోంది. తక్షణం ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలని వ్యవసాయ నిపుణులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం సాగునీటి సరఫరా లేక ఎండిపోయిన పంటలను రైతులు దున్నేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గ్రాసం కొరతతో పశువులు కబేళాకు తరలుతున్నాయి. వాస్తవానికి వర్షపాతం, జిల్లా కలెక్టర్ల నివేదిక, పంట దిగుబడి తగ్గుదల తదితర కోణాల్లో కరువు మండలాలను ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే మండల అధికారులు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించకుండా అధికార యంత్రాంగానికి నివేదిక పంపడం వల్లనే జిల్లాలో కరువు మండలాల సంఖ్య పెరగలేదనే అభిప్రాయం ఉంది. పల్నాడులో మిర్చి, పత్తి, ఇతర వాణిజ్య పంటలు సాగునీరులేక ఎండిపోతున్నాయి. డెల్టాలో పొట్టదశకు చేరుకున్న వరిని కాపాడుకునేందుకు రైతులు కాల్వలోని నీటిని డీజిల్ ఇంజన్లతో తోడి పొలాలు తడుపుతున్నారు. రోజూ అయిదు లేదా ఆరుగంటలు డీజిల్ ఇంజన్లు వినియోగించడంతో ఖర్చులు తడిసిమోపెడై అప్పుల పాలవుతున్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లోని పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్ సీపీ వినతి...
సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), జి.శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి తదితరులు జిల్లా జేసీ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
కరువు కోరలు చాస్తున్నా...
కృష్ణా జిల్లాలో ఏటా 8.60 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణంగా ఉంటుంది. దీనిలో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4.64 లక్షల ఎకరాలు మాత్రమే సాగు కాగా, మిగిలిన 1.70 లక్షల ఎకరాల్లో అసలు నాట్లు పడలేదు. డెల్టాలోని కాల్వల ద్వారా చివరి ప్రాంతాల్లోని భూములకు నీరు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, 80 వేల ఎకరాల్లో కూరగాయలు, 44 వేల ఎకరాల్లో చెరకు, 22 వేల ఎకరాల్లో మిర్చి, 12 వేల ఎకరాల్లో మెక్కజొన్న, ఇతర పంటలు ప్రసుత్తం సాగులో ఉన్నాయి. వీటికి అవసరమైన నీటిని ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి సకాలంలో విడుదల చేయడంలో నీటిపారుదల శాఖ విఫలమైంది. ఆగస్టు 15నాటికల్లా సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆర్భాటంగా ప్రకటించినా నీరు విడుదల కాలేదు. అధికారులేమో సాగర్‌లో నీటిమట్టం తక్కువ ఉందని నీళ్లివ్వలేమని చెబుతున్నారు.
3,200 క్యూసెక్కులు మాత్రమే విడుదల...
ప్రస్తుతం పులిచింతలలో 0.9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీనిలో కొంత తాగునీటి అవసరాలకు కేటాయించి మిగిలిన నీటిని సాగుకోసం విడుదల చేస్తున్నారు. రోజుకు 16 వేల క్యూసెక్కులు అవసరంకాగా, 3,200 మాత్రమే వదులుతున్నారు. దీంతో జిల్లాలో చివరి భూములైన బందరు, పెడన, అవనిగడ్డ, కైకలూరు, పామర్రు మండలాల్లో వేలాది హెక్టార్లకు నీరందక రైతులు అగచాట్లు పడుతున్నారు. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామం, పామర్రు నియోజకవర్గం కొరిమెర్ల గ్రామంలో రైతులు పంట విరామం ప్రకటించి ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ కృష్ణాలోని తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామలో సాగునీరు లేక పంటలు ఎండిపోయే దశకు చేరుతున్నాయి. దీంతో మొత్తం జిల్లాలో 1.39 లక్షల మంది రైతులు సాగు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కృష్ణాలో 21 మం డలాల్లో వర్షపాతం సైతం తక్కువ నమోదైంది. ఈ ఖరీఫ్‌లో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు సగటున 838.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 720 మాత్రమే నమోదైంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే జిల్లాలో కరువు మండలమే లేదని సర్కార్ తేల్చడం శోచనీయం. రాజధాని జిల్లా అనే కారణంతో కృష్ణాను కరువు జిల్లాల జాబితాలోకి చేర్చలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.