విడుదలైన డీఎస్సీ ఫలితాలు
భానుగుడి (కాకినాడ) : కొందరిది కొన్ని సంవత్సరాల నిర్విరామ పోరాటం. మరికొందరిది కొన్ని నెలల తపస్సు. ఇంకొందరిది కఠోరశ్రమ. ఏదేమైనా అందరూ కంటిమీద కునుకు లేకుండా కష్టపడి చదివారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం నిర్వహించిన డీఎస్సీని ఢీకొట్టారు. ఎట్టకేలకు వాటి ఫలితాలు మంగళవారం రానేవచ్చాయి. ఇప్పటివరకూ ఫలితాల కోసం ఎదురు చూసిన వారంతా ప్రస్తుతం పోస్టుకు కటాఫ్ ఎంత ఉంటుందోనన్న ఉత్కంఠకు గురవుతున్నారు. జిల్లాలో 1,344 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత నెల 9, 10, 11 తేదీల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌కు సంబంధించిన 860 పోస్టులకు గాను 4,600 మంది.. స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాలకు సంబంధించిన 466 పోస్టులకు 21,377 మంది ఈ పరీక్ష రాశారు. డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా ఇంటర్‌నెట్ సెంటర్లలో హడావుడి నెలకొంది. అలాగే ఎవరెవరికి ఎన్ని మార్కులొచ్చాయంటూ ఫోన్లలో ఆరా తీశారు. అందరికీ కటాఫ్ పైనే ఉత్కంఠ ఏర్పడింది. కొద్ది రోజుల్లో డీఈఓ కార్యాలయంలో ర్యాంకర్ల వివరాలు అందుబాటులోకి రానున్నాయి. అప్పటి వరకూ ఈ ఉత్కంఠ కొనసాగక తప్పదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.
కటాఫ్‌పై ఉత్కంఠ
Published Wed, Jun 3 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement