Teacher Recruitment replacement
-
ఒకే పరీక్షా? రెండు పరీక్షలా?
♦ డీఎస్సీ, టెట్ వేర్వేరుగా నిర్వహిస్తారా? ♦ రెండూ కలిపి ‘టెర్ట్’ నిర్వహిస్తారా! ♦ అయోమయంలో అభ్యర్థులు, అధికారులు ♦ త్వరలోనే నిర్ణయం: కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ, టెట్ కలిపి ఒకే పరీక్షగా నిర్వహిస్తారా? లేక వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారా? దీనిపై స్పష్టత కోసం అభ్యర్థులతోపాటు అధికారులూ ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగుల్లో ఆత్రుత మరింత ఎక్కువైంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారన్న అంశంతోపాటు ఒకే పరీక్ష ఉంటుందా? వేర్వేరు పరీక్షలు ఉంటాయా? అన్న స్పష్టతను కోరుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వం ఏం చెబుతుందోనన్న సమాచారం కోసం వేచి ఉన్నారు. జనవరి 24న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినా, దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. ఇదీ టెట్ నేపథ్యం.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు టెట్ నిర్వహించారు. అయితే ఉపాధ్యాయ విద్యా కోర్సులో చేరేందుకు ఎంపి క పరీక్ష, కోర్సు వార్షిక పరీక్షలు, ఆ తరువాత ఉపాధ్యాయ నియామక పరీక్ష.. ఇలా ఇన్ని పరీక్షల్లో అర్హతతోపాటు ప్రతిభ కనబరిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నపుడు మళ్లీ ప్రత్యేకంగా టెట్ అవసరమా? అన్న వాదనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై 2013లో ప్రభుత్వం కమిటీ వేయగా, టెట్, డీఎస్సీలను వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగా ‘టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్టు (టెర్ట్)’ పేరుతో ఒకే పరీక్షగా నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే అది అప్పట్లో అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం మాత్రం రెండింటినీ కలిపి టెర్ట్ను నిర్వహించింది. అయితే, రెండు వేర్వేరు పరీక్షలు కాకుండా టెర్ట్ పేరుతో ఒకే రోజు పేపరు-1, పేపరు-2 (ఒకటి టెట్, మరొకటి టీఆర్టీ) పరీక్షలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సర్కారు ఆలోచనలు చేసింది. అలాగే, ఎన్సీటీఈ ఆదేశాల ప్రకారం టెట్‌ను వేరుగానే నిర్వహించాలని, రెండింటినీ కలిపి నిర్వహించడానికి వీల్లేదని భావించింది. అందుకే ఈనెల 14న టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే టెట్ ఉత్తర్వుల్లో సవరణలు అవసరం ఉండటంతో ప్రభుత్వానికి రాసింది. దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. ఈ లోగా సీఎం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే నిర్ణయం: కడియం టెట్, డీఎస్సీ పరీక్ష విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ముందుగా ఉపాధ్యాయ ఖాళీలను తేల్చాల్సి ఉందన్నారు. ఆ తరువాత సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు. టెట్, డీఎస్సీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలా? లేదా టెర్ట్‌గా ఒకటే నిర్వహించాలా? అన్న అంశంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
కటాఫ్‌పై ఉత్కంఠ
విడుదలైన డీఎస్సీ ఫలితాలు భానుగుడి (కాకినాడ) : కొందరిది కొన్ని సంవత్సరాల నిర్విరామ పోరాటం. మరికొందరిది కొన్ని నెలల తపస్సు. ఇంకొందరిది కఠోరశ్రమ. ఏదేమైనా అందరూ కంటిమీద కునుకు లేకుండా కష్టపడి చదివారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం నిర్వహించిన డీఎస్సీని ఢీకొట్టారు. ఎట్టకేలకు వాటి ఫలితాలు మంగళవారం రానేవచ్చాయి. ఇప్పటివరకూ ఫలితాల కోసం ఎదురు చూసిన వారంతా ప్రస్తుతం పోస్టుకు కటాఫ్ ఎంత ఉంటుందోనన్న ఉత్కంఠకు గురవుతున్నారు. జిల్లాలో 1,344 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత నెల 9, 10, 11 తేదీల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌కు సంబంధించిన 860 పోస్టులకు గాను 4,600 మంది.. స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాలకు సంబంధించిన 466 పోస్టులకు 21,377 మంది ఈ పరీక్ష రాశారు. డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా ఇంటర్నెట్ సెంటర్లలో హడావుడి నెలకొంది. అలాగే ఎవరెవరికి ఎన్ని మార్కులొచ్చాయంటూ ఫోన్లలో ఆరా తీశారు. అందరికీ కటాఫ్ పైనే ఉత్కంఠ ఏర్పడింది. కొద్ది రోజుల్లో డీఈఓ కార్యాలయంలో ర్యాంకర్ల వివరాలు అందుబాటులోకి రానున్నాయి. అప్పటి వరకూ ఈ ఉత్కంఠ కొనసాగక తప్పదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
నేటితో డీఎస్సీ పరిసమాప్తం..
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు సోమ వారం ముగియనున్నాయి. డీఎస్సీ-2014లో భాగంగా ఉపాధ్యాయ అర్హత-నియామక పరీక్ష (టెట్ కం టీఆర్టీ) ఆదివారం సజావుగా జరిగింది. గుంటూరులోని 20 కేంద్రాల్లో జరిగిన భాషా పండిట్, పీఈటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3,663 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 16 కేంద్రాల్లో జరిగిన ఎల్పీటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన 3,402 మంది అభ్యర్థుల్లో 3,012 మంది హాజరయ్యారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగిన పీఈటీ పరీక్షకు దరఖాస్తు చేసిన 780 మంది అభ్యర్థులకు 651 మంది పరీక్ష రాశారు. కేంద్రాల పరిధిలో అభ్యర్థులకు తాగునీరు, ఫర్నీచర్ సదుపాయాలను కల్పించ డంలో విద్యాశాఖాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు నిర్ణీత సమయానికే కేంద్రాలకు చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నేటితో ముగియనున్న డీఎస్సీ పరీక్షలు .... రెండు రోజులుగా జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు సోమవారం ముగియనున్నాయి. సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 25,679 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం గుంటూరు నగరంలోని 107 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు 25 కేంద్రాల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పరీక్షకు 5,259 మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకు 92 కేంద్రాల్లో జరిగే స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్షలకు 20,420 మంది హాజరుకానున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. పట్నంబజారు (గుంటూరు): ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పిన్నమనేని వెంకటరామారావు తెలిపారు. ఆదివారం సైతం రీజియన్ పరిధిలో 548 బస్సులు తిరగగా 200 బస్సులను ప్రత్యేకంగా డీఎస్సీ పరీక్షలకు కోసం కేటాయించడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం 8 గంటల్లోపు గుంటూరు చేరుకునేందుకు రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి బస్సులు తిరుగుతాయని చెప్పారు. అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని అధికంగా సర్వీసులు నడిపేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. రీజియన్ పరిధిలో 952 బస్సులు తిరగాల్సి ఉండగా, తాత్కాలిక కార్మికులచే సుమారు 600 సర్వీసుల వరకు తిప్పుతున్నామని వివరించారు. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో... ఎంట్రీ నేడు గుంటూరులోని 17 కేంద్రాల్లో ఎస్జీటీ పరీక్ష అరగంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి మూడు రోజులు జరగనున్న టెట్ కం టీఆర్టీ గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శనివారం నుంచి మూడు రోజుల పాటు ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష (టెట్ కం టీఆర్టీ)లు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాసేందుకు హాజరుకానున్న 33,380 మంది అభ్యర్థుల కోసం జిల్లా విద్యాశాఖ గుంటూరు నగరంలో 107 కేంద్రాలను సిద్ధం చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండిట్, పీఈటీ కేటగిరీల వారీగా ఖాళీగా ఉన్న 951 పోస్టుల భర్తీకి సంబంధించి జరిగే పరీక్షలకు ఆయా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్దేశిత సమయానికి కనీసం అరగంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 17 కేంద్రాల్లో జరగనున్న ఎస్జీటీ పరీక్షకు 3,520 మంది హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో నిఘా.. పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులు, అవకతవకలను నిరోధించేందుకు కేంద్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద 100 మీటర్ల లోపు 144వ సెక్షన్ అమల్లో ఉంచడంతో పాటు సమీపంలోని జిరాక్స్ దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు మూసి ఉంచాలని డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, ఇప్పటికే పొందిన హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే కేంద్రాల్లోని నామినల్ రోల్స్ ఆధారంగా పొరపాట్లను సరిచేస్తారు. హాల్ టికెట్లలో తప్పిదాలను ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఏర్పాటు చేసిన 0863-2229107 నంబరు దృష్టికి తెచ్చి సలహాలు, సూచనలు పొందవచ్చని డీఈవో వివరించారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్ను మినహా మరే ఇతర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను తమ వెంట తీసుకురాకూడదని స్పష్టం చేశారు. పరీక్షల షెడ్యూల్.. 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 17 కేంద్రాల్లో జరిగే ఎస్జీటీ పరీక్షలకు 3,520 మంది హాజరుకానున్నారు.10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 16 కేంద్రాల్లో జరిగే భాషా పండిట్ పరీక్షలకు 3,401 మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షకు780 మంది హాజరుకానున్నారు. 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు 25 కేంద్రాల్లో జరగనున్న స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పరీక్షలకు 5,259 మంది, మధా ్యహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6.15 వరకు 90 కేంద్రాల్లో జరగనున్న స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పరీక్షలకు 20,420 మంది హాజరుకానున్నారు.