ఒకే పరీక్షా? రెండు పరీక్షలా?
♦ డీఎస్సీ, టెట్ వేర్వేరుగా నిర్వహిస్తారా?
♦ రెండూ కలిపి ‘టెర్ట్’ నిర్వహిస్తారా!
♦ అయోమయంలో అభ్యర్థులు, అధికారులు
♦ త్వరలోనే నిర్ణయం: కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ, టెట్ కలిపి ఒకే పరీక్షగా నిర్వహిస్తారా? లేక వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారా? దీనిపై స్పష్టత కోసం అభ్యర్థులతోపాటు అధికారులూ ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగుల్లో ఆత్రుత మరింత ఎక్కువైంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారన్న అంశంతోపాటు ఒకే పరీక్ష ఉంటుందా? వేర్వేరు పరీక్షలు ఉంటాయా? అన్న స్పష్టతను కోరుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వం ఏం చెబుతుందోనన్న సమాచారం కోసం వేచి ఉన్నారు. జనవరి 24న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినా, దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది.
ఇదీ టెట్ నేపథ్యం..
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు టెట్ నిర్వహించారు. అయితే ఉపాధ్యాయ విద్యా కోర్సులో చేరేందుకు ఎంపి క పరీక్ష, కోర్సు వార్షిక పరీక్షలు, ఆ తరువాత ఉపాధ్యాయ నియామక పరీక్ష.. ఇలా ఇన్ని పరీక్షల్లో అర్హతతోపాటు ప్రతిభ కనబరిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నపుడు మళ్లీ ప్రత్యేకంగా టెట్ అవసరమా? అన్న వాదనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై 2013లో ప్రభుత్వం కమిటీ వేయగా, టెట్, డీఎస్సీలను వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగా ‘టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టెర్ట్)’ పేరుతో ఒకే పరీక్షగా నిర్వహించాలని సిఫారసు చేసింది.
అయితే అది అప్పట్లో అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం మాత్రం రెండింటినీ కలిపి టెర్ట్‌ను నిర్వహించింది. అయితే, రెండు వేర్వేరు పరీక్షలు కాకుండా టెర్ట్ పేరుతో ఒకే రోజు పేపరు-1, పేపరు-2 (ఒకటి టెట్, మరొకటి టీఆర్‌టీ) పరీక్షలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సర్కారు ఆలోచనలు చేసింది. అలాగే, ఎన్‌సీటీఈ ఆదేశాల ప్రకారం టెట్‌ను వేరుగానే నిర్వహించాలని, రెండింటినీ కలిపి నిర్వహించడానికి వీల్లేదని భావించింది. అందుకే ఈనెల 14న టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే టెట్ ఉత్తర్వుల్లో సవరణలు అవసరం ఉండటంతో ప్రభుత్వానికి రాసింది. దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. ఈ లోగా సీఎం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
త్వరలోనే నిర్ణయం: కడియం
టెట్, డీఎస్సీ పరీక్ష విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ముందుగా ఉపాధ్యాయ ఖాళీలను తేల్చాల్సి ఉందన్నారు. ఆ తరువాత సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు. టెట్, డీఎస్సీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలా? లేదా టెర్ట్‌గా ఒకటే నిర్వహించాలా? అన్న అంశంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.