⇒ ఆంధ్ర అభ్యర్థులకే దరఖాస్తుకు అవకాశం
⇒ఒడియా మీడియంలో 90 పోస్టులు ఖాళీ
⇒జిల్లాలో ఆ మీడియం అభ్యర్థులు లేరు
⇒ఒడిశా రాష్ట్రంవారికి అవకాశం లేదు
⇒ఫలితంగా ఆ పోస్టులు భర్తీ కాని పరిస్థితి
⇒ఇక్కడ స్థిరపడిన తెలంగాణవాసులదీ అదే దుస్థితి
⇒న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న అభ్యర్థులు
శ్రీకాకుళం: డీఎస్సీ-2015లో నోటిఫై చేసిన పోస్టుల్లో ఒడియా మీడియానికి చెందిన చాలా పోస్టులు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఎన్నడూ లేనివిధంగా ఈ డీఎస్సీలో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడమే దీనికి కారణమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డీఎస్సీ వరకు ఇతర జిల్లాల వారితో పాటు ఇతర రాష్ట్రాల వారిని స్థానికేతరులుగా పరిగణించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ప్రస్తుత డీఎస్సీలో మాత్రం ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల వారికి మాత్రమే అనుమతిస్తుండడం వివాదంగా మారింది. దీని వల్ల ఒడియా మీడియం పోస్టులు మిగిలిపోవడమే కాకుండా ఆంధ్రలో స్థిరపడిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 192 ఒడియా మీడియం పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 106 పూర్తిగా ఒడియా మీడియం స్కూళ్లు కాగా మిగిలిన 86 పాఠశాలలను తెలుగుతో పాటు ఒడియా మీడియంలోనూ నిర్వహిస్తున్నారు. వీటికి 575 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి.
వీటిలో 44 ఎస్జీటీ, 32 స్కూల్ అసిస్టెంట్, 11 గ్రేడ్-2 పండిట్, ఒక పీఈటీ పోస్టులు ఖాళీగా ఉండడంతో డీఎస్సీలో నోటిఫై చేశారు. అయితే జిల్లాలో ఒడియా అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు. గతంలో డీఎస్సీ నిర్వహించిన ప్రతిసారీ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు ఒడియా మీడియం పోస్టులకు దరఖాస్తు చేసి ఎంపికయ్యారు. ఈసారి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వకపోవడంతో నోటిఫై చేసిన ఒడియా పోస్టులు ఖాళీగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలుగు మీడియంలో కూడా స్థానికేతర వివాదం ముదురుతోంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనేక మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకునో, ఇతరత్రా కారణాల తోనో ఆంధ్ర రాష్ట్రంలో స్థిరపడ్డారు. అటువంటి వారు డీఎస్సీ కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే ఇతర రాష్ట్రాలవారికి అవకాశం లేకుండా చేయడంతో వారంతా నిరాశకు గురయ్యారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పరీక్ష రాసినంత మాత్రాన స్థానిక అభ్యర్థులతో పోటీ పడే అవకాశం ఉండదు.
స్థానికేతర పోస్టుల కోసమే పోటీ పడతారు. అటువంటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇటువంటి ప్రత్యేక నిర్ణయం తీసుకుందో ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు. ఇప్పటికీ పలువురు అభ్యర్థులు, కుల, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వినతులు సమర్పించినా ఫలితం లేకపోవడంతో న్యాయ పోరాటానికి కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే డీఎస్సీ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోలేదు.
డీఎస్సీలో ‘స్థానిక’ వివాదం
Published Sat, Jan 3 2015 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM
Advertisement