గుంటూరులో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న పీఈటీ అభ్యర్థులతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆందోళన చేస్తున్న అభ్యర్థులను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు
గుంటూరు ఈస్ట్/ కాకినాడ సిటీ: ప్రభుత్వం పీఈటీ పోస్టులు పెంచాలని, లేకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. గుంటూరు, కాకినాడల్లో వాటర్ ట్యాంకుల పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. గుంటూరులో వీరి నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆందోళనకు దిగినవారిని మహిళా అభ్యర్థులని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పీఈటీ అభ్యర్థులు గుంటూరు చేరుకున్నారు. 1,056 పీఈటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆనందపేటలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. అభ్యర్థుల్లో కొందరు ట్యాంక్ పైకి ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ నినదించారు. మిగిలిన వారు పోలీసులు పైకి వెళ్లకుండా మెట్ల వద్ద అడ్డుగా నిలబడి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
నిరసన ఉధృతరూపం దాల్చడంతో ఆర్డీఓ వీరబ్రహ్మం, ఆర్‌జేడీ శ్రీనివాసరెడ్డి, డీఈఓ గంగాభవాని, డీఎస్పీ కండే శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే నిరసన విరమిస్తామని, లేదంటే ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందంటూ మండిపడ్డారు.రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యక్షుడు పి.రమేష్, ఇతర నాయకులు హరికృష్ణ, లక్ష్మణ్, అజరత్‌రెడ్డి మాట్లాతూ.. ప్రభుత్వం 1,056 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన వేలాదిమంది అభ్యర్థులు అంతవరకు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు మానివేశారన్నారు. ఒక్కొక్కరు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నారని, టెట్ పరీక్ష అర్హత పొందిన మహిళా అభ్యర్థులు శారీరకç దారుఢ్య పరీక్షల కోసం గర్భస్రావాలు సైతం చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ప్రభుత్వం 47 పోస్టులనే ప్రకటించడంతో విజయనగరం, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు గుర్తు చేశారు.
పోలీసుల దౌర్జన్యం
సాయంత్రం 4గంటల సమయంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి.రామన్న నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పీఈటీ అభ్యర్థులను వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ట్యాంక్ మెట్ల వద్ద నిరసన తెలుపుతున్న మహిళా అభ్యర్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో వారు పెద్దపెట్టున రోదించారు. ట్యాంక్‌పై ఉన్న మహిళా అభ్యర్థులు తాము కిందకు దిగబోమని, ఆత్మహత్య చేసుకుంటామంటూ పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకుని దూకేందుకు ప్రయత్నించడంతో వారి మధ్య తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ, మరికొందరు అభ్యర్థులు స్వల్పంగా గాయపడ్డారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. విద్యా శాఖ మంత్రి ప్రకటించిన విధంగా 1,056 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలావుండగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూడా సుమారు 100 మంది పీఈటీలు ఆందోళనకు దిగారు. కుళాయి చెరువు ఆవరణలోని ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కొనసాగించారు. అర్బన్ తహసీల్దార్ వరాలయ్య, పోలీసు ఉన్నతాధికారులు వారితో చర్చించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment