PET posts Recruitment
-
పోస్టులు పెంచకుంటే ఆత్మహత్యలు
గుంటూరు ఈస్ట్/ కాకినాడ సిటీ: ప్రభుత్వం పీఈటీ పోస్టులు పెంచాలని, లేకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. గుంటూరు, కాకినాడల్లో వాటర్ ట్యాంకుల పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. గుంటూరులో వీరి నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆందోళనకు దిగినవారిని మహిళా అభ్యర్థులని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పీఈటీ అభ్యర్థులు గుంటూరు చేరుకున్నారు. 1,056 పీఈటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆనందపేటలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. అభ్యర్థుల్లో కొందరు ట్యాంక్ పైకి ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ నినదించారు. మిగిలిన వారు పోలీసులు పైకి వెళ్లకుండా మెట్ల వద్ద అడ్డుగా నిలబడి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరసన ఉధృతరూపం దాల్చడంతో ఆర్డీఓ వీరబ్రహ్మం, ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి, డీఈఓ గంగాభవాని, డీఎస్పీ కండే శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే నిరసన విరమిస్తామని, లేదంటే ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందంటూ మండిపడ్డారు.రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యక్షుడు పి.రమేష్, ఇతర నాయకులు హరికృష్ణ, లక్ష్మణ్, అజరత్రెడ్డి మాట్లాతూ.. ప్రభుత్వం 1,056 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన వేలాదిమంది అభ్యర్థులు అంతవరకు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు మానివేశారన్నారు. ఒక్కొక్కరు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నారని, టెట్ పరీక్ష అర్హత పొందిన మహిళా అభ్యర్థులు శారీరకç దారుఢ్య పరీక్షల కోసం గర్భస్రావాలు సైతం చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ప్రభుత్వం 47 పోస్టులనే ప్రకటించడంతో విజయనగరం, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు గుర్తు చేశారు. పోలీసుల దౌర్జన్యం సాయంత్రం 4గంటల సమయంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి.రామన్న నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పీఈటీ అభ్యర్థులను వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. ట్యాంక్ మెట్ల వద్ద నిరసన తెలుపుతున్న మహిళా అభ్యర్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో వారు పెద్దపెట్టున రోదించారు. ట్యాంక్పై ఉన్న మహిళా అభ్యర్థులు తాము కిందకు దిగబోమని, ఆత్మహత్య చేసుకుంటామంటూ పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకుని దూకేందుకు ప్రయత్నించడంతో వారి మధ్య తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ, మరికొందరు అభ్యర్థులు స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. విద్యా శాఖ మంత్రి ప్రకటించిన విధంగా 1,056 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలావుండగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూడా సుమారు 100 మంది పీఈటీలు ఆందోళనకు దిగారు. కుళాయి చెరువు ఆవరణలోని ఓవర్హెడ్ ట్యాంకు ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కొనసాగించారు. అర్బన్ తహసీల్దార్ వరాలయ్య, పోలీసు ఉన్నతాధికారులు వారితో చర్చించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. -
పీఈటీ అభ్యర్థుల ఆందోళన
-
విజయవాడలో పీఈటీ అభ్యర్థుల ఆందోళన
విజయవాడ: నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద పీఈటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 1056 పోస్టులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 47 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడాన్ని పీఈటీ అభ్యర్థులు తప్పుబట్టారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మంత్రి గంటా శ్రీనివాస రావు ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆరోపించారు. 1056 పోస్టులు భర్తీ చేయనపుడు, 20 వేల మందికి టెట్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ప్రభుత్వం 1056 పోస్టులు ప్రకటించకపోతే మాకు చావే శరణ్యమని అభ్యర్థులు వాపోయారు. -
డీఎస్సీలో ‘స్థానిక’ వివాదం
⇒ ఆంధ్ర అభ్యర్థులకే దరఖాస్తుకు అవకాశం ⇒ఒడియా మీడియంలో 90 పోస్టులు ఖాళీ ⇒జిల్లాలో ఆ మీడియం అభ్యర్థులు లేరు ⇒ఒడిశా రాష్ట్రంవారికి అవకాశం లేదు ⇒ఫలితంగా ఆ పోస్టులు భర్తీ కాని పరిస్థితి ⇒ఇక్కడ స్థిరపడిన తెలంగాణవాసులదీ అదే దుస్థితి ⇒న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న అభ్యర్థులు శ్రీకాకుళం: డీఎస్సీ-2015లో నోటిఫై చేసిన పోస్టుల్లో ఒడియా మీడియానికి చెందిన చాలా పోస్టులు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఎన్నడూ లేనివిధంగా ఈ డీఎస్సీలో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడమే దీనికి కారణమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డీఎస్సీ వరకు ఇతర జిల్లాల వారితో పాటు ఇతర రాష్ట్రాల వారిని స్థానికేతరులుగా పరిగణించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుత డీఎస్సీలో మాత్రం ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల వారికి మాత్రమే అనుమతిస్తుండడం వివాదంగా మారింది. దీని వల్ల ఒడియా మీడియం పోస్టులు మిగిలిపోవడమే కాకుండా ఆంధ్రలో స్థిరపడిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 192 ఒడియా మీడియం పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 106 పూర్తిగా ఒడియా మీడియం స్కూళ్లు కాగా మిగిలిన 86 పాఠశాలలను తెలుగుతో పాటు ఒడియా మీడియంలోనూ నిర్వహిస్తున్నారు. వీటికి 575 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 44 ఎస్జీటీ, 32 స్కూల్ అసిస్టెంట్, 11 గ్రేడ్-2 పండిట్, ఒక పీఈటీ పోస్టులు ఖాళీగా ఉండడంతో డీఎస్సీలో నోటిఫై చేశారు. అయితే జిల్లాలో ఒడియా అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు. గతంలో డీఎస్సీ నిర్వహించిన ప్రతిసారీ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు ఒడియా మీడియం పోస్టులకు దరఖాస్తు చేసి ఎంపికయ్యారు. ఈసారి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వకపోవడంతో నోటిఫై చేసిన ఒడియా పోస్టులు ఖాళీగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలుగు మీడియంలో కూడా స్థానికేతర వివాదం ముదురుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనేక మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకునో, ఇతరత్రా కారణాల తోనో ఆంధ్ర రాష్ట్రంలో స్థిరపడ్డారు. అటువంటి వారు డీఎస్సీ కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే ఇతర రాష్ట్రాలవారికి అవకాశం లేకుండా చేయడంతో వారంతా నిరాశకు గురయ్యారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పరీక్ష రాసినంత మాత్రాన స్థానిక అభ్యర్థులతో పోటీ పడే అవకాశం ఉండదు. స్థానికేతర పోస్టుల కోసమే పోటీ పడతారు. అటువంటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇటువంటి ప్రత్యేక నిర్ణయం తీసుకుందో ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు. ఇప్పటికీ పలువురు అభ్యర్థులు, కుల, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వినతులు సమర్పించినా ఫలితం లేకపోవడంతో న్యాయ పోరాటానికి కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే డీఎస్సీ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోలేదు.