ముందస్తుగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఆశల పంటకు ఊపిరి పోశాయి. అత్యధిక విస్తీర్ణంలో పైర్లు సాగయ్యాయి. అయితే పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు ముంచేశాయి. అలాగే చీడపీడలు ప్రబలి దిగుబడులు భారీగా తగ్గాయి. నకిలీపురుగు మందులు సైతం అన్నదాత పాలిట శాపంగా మారాయి. గిట్టుబాటు ధర లభించక నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఉల్లి సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండింది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో కొంత ఉపశమనం లభించినట్లయింది. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయంలో కొంత మోదం..మరికొంత ఖేదం మిగిలింది.
- న్యూస్‌లైన్, కర్నూలు
(అగ్రికల్చర్)
దరిచేరని పథకాలు..
2013లో ప్రభుత్వం చేపట్టిన పథకాలు రైతులకు చేరలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉద్యోగుల సమ్మె కారణంగా వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూచేతన కార్యక్రమం రైతులకు అందలేదు. భూముల్లోని సూక్ష్మ పోషకాల లోపాలను నివారించేందుకు ఉద్దేశించిన ఈ పథకం కాగితాలకే పరిమితం అయింది. సీడ్ విలేజ్ ప్రోగ్రామ్, పొలంబడి, ఐసోఫాం తదితర పథకాలు ఆచరణకు నోచుకోలేదు.
ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి అక్టోబర్ నెల వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో సాధారణ సాగు 5.61 లక్షల హెక్టార్లు ఉండగా అది 6.51 లక్షల హెక్టార్లకు చేరింది. ఎప్పుడూ లేని విధంగా ఈఏడాది పత్తి రికార్డుస్థాయి 2.03 లక్షల హెక్టార్లలో వేశారు. అయితే ఖరీఫ్ పంటలకు చీడపీడలు సోకడంతో దిగుబడులు పడిపోయాయి. అంతంతమాత్రం పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో 2013లో కూడా రైతులకు అప్పుల కుప్పే మిగిలింది. అయితే ఈ ఏడాది ఉల్లి రైతులు మాత్రం మంచి లాభాలు గడించారు. క్వింటా ధర రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండే ఉల్లి ఒక దశలో రూ.5000 వరకు వెళ్లింది. ఉల్లి సాగు చేసిన రైతుల్లో 80 శాతం మంది నష్టాలనుంచి గట్టెక్కారు.
నకి‘లీలలు’
నకిలీ పురుగుమందులు 2013లో వెల్లువెత్తాయి. వీటి బారిన పడి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. రైతుసంఘాల అంచనాల ప్రకారం జిల్లాలో దాదాపు రూ. 300 కోట్ల విలువ చేసే నకిలీ పురుగుమందుల విక్రయాలు సాగాయి. నకిలీ బయో పెస్టిసైడ్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు వర్ధిల్లింది. జిల్లాలో 2013లో నకిలీ బయోమందులు దాదాపు రూ.600 కోట్ల విలువ అమ్మకం అయినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రూ.5 కోట్ల విలువ చేసే నకిలీ పురుగుమందులు, నకిలీ బయో పెస్టిసైడ్స్‌ను సీజ్ చేయడం గమనార్హం.
నిరాశపరచిన రబీ...
రబీ సీజన్ కూడా నిరాశపరచింది. ఈసారి 2.02 లక్షల హెక్టార్లలో శెనగ వేయగా చీడపీడలు పొగమంచు కారణంగా దెబ్బతినింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో చినుకు లేకపోవడంతో పైర్లు ఎదుగు బొదుగు లేకుండాపోయాయి. రబీ సాధారణ సాగు 4.35 లక్షలు ఉండగా 3.14 లక్షల హెక్టార్లకే పరిమితం అయింది.
ధరలు పతనం...
మామూలుగా అయితే ఏడాదికేడాది వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పెరగాలి. 2013లో మాత్రం ధరలు తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేసింది. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, శెనగ ఇలా అన్ని పంటల ధరలు పడిపోయాయి. మొక్కజొన్న మద్దతు ధర రూ.1,310 ఉంటే మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.1,100 మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్, జేసీలు చొరవ తీసుకుని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1.30 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను ఎంఎస్పీతో కొనిపించారు. వేరుశెనగ, పత్తి, శెనగ ధరలు పడిపోయినా కొనుగోలు సెంటర్ల ఏర్పాటు గూర్చి పట్టించుకోలేదు.
సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ కరువు...
ప్రభుత్వం సరఫరా చేసిన సబ్సిడీ విత్తనాలను తీసుకునేందుకు రైతులు ఉత్సాహం చూపలేదు. జిల్లాకు ఖరీఫ్‌లో 64 వేల క్వింటాళ్ల వేరుశెనగ మంజూరు కాగా, 32 వేల క్వింటాళ్లు మాత్రం పంపిణీ అయింది. రబీలో 4 వేల క్వింటాళ్ల శెనగ విత్తనాలు మంజూరయ్యాయి. పూర్తి ధర చెల్లించి విత్తనాలు తీసుకుంటే తర్వాత సబ్సిడీని బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో రైతులు మందుకు రాలేదు.
థైవాన్ స్ప్రేయర్ల కోసం ఎదురుచూపు...
థైవాన్ స్ప్రేయర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో పాటు నీటి సరఫరా పైపులు, స్ప్రింకర్లకు డిమాండ్ ఉంది. 2013లో రైతులు ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటిని పంపిణీ చేయలేకపోయారు. నాన్ సబ్సిడీ ఎంత చెల్లించాలనేదానిని వ్యవసాయ శాఖ ప్రకటించకపోవడంతో రైతులు వీటిని పొందలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి వ్యవసాయ శాఖ 2013-14 సంవత్సరానికి సంబంధించి వీటిని పంపిణీ చేయడం లేదని చేతులెత్తేసింది.
దెబ్బతీసిన వర్షాలు...
అక్టోబర్ 22 నుంచి 27 వరకు తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లడం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, వరి, శెనగ, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 40 వేల హెక్టార్లలో అతివృష్టి ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. అయితే వ్యవసాయాధికారులు కేవలం 4,500 హెక్టార్లలోనే పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు.
ఆశల మొలక.. నష్టాల మునక
Published Sat, Dec 28 2013 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement