విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వ్యవసాయాధికారులు కాకుండా రెవెన్యూ అధికారులు పంటనష్టాన్ని అంచనావేస్తున్నారు. ఒక వైపు కష్టం గంగపాలైన ఆవేదనలో ఉన్న రైతన్నలు సిబ్బంది ఛీత్కారాలతో మరింత మనోవేదనకు గురవుతున్నారు. ఆత్మాభిమానం చంపుకోలేక, సిబ్బంది చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. వారం రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాలు అన్నదాతను నిండా ముంచితే...వారిని ఆదుకోవలసిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం వంచనకు పాల్పడుతున్నాయి. ఓ పక్క అధికారుల తీరు, మరోవైపు సర్కార్ వైఖరి రైతులను నట్టేట ముంచేలా ఉన్నాయి. చాలా మంది అధికారులు, సిబ్బంది ఇళ్లలో కూర్చొని నివేదికలు తయారు చేస్తుంటే... పొలాల్లో పంట 50 శాతం దాటి నష్టపోతేనే పరిహారం ఇచ్చేలా నివేదికలు తయారుచేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేస్తున్నాయి. దీంతో ప్రకృతే కాదు... ప్రభుత్వం కూడా తమపై కరుణ చూపడంలేదని.. మట్టిని న మ్మకున్నా తామంతా ఆ మట్టిలో కలిసిపోవలసిందేనా అంటూ కర్షకులు కన్నీటి పర్యంతమవున్నారు. నష్టం చాలా ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం చలించడంలేదని వారు ఆవేదన వక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి వర్షం నష్టం అంచనాలు రూపొందించాల్సిన అధికారులు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నా వాటి ప్రభావం క్షేత్ర స్థాయిలో కన్పించడం లేదు. దిగువ స్థాయిలో జరుగుతున్న సర్వేలపై ఉన్నతాధికారులు దృష్టిసారించక పోవడంతో రైతుల ఆవేదన చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా ఉంది. అనేక గ్రామాల్లో క్షేత్రస్థాయి అధికారులు కనీసం పర్యటించ లేదంటే పంటనష్టం అంచనాలు ఎంత పక్కాగా జరిగాయో స్పష్టమవుతుంది. కొంత మంది రైతులు సమాచారం ఇచ్చినప్పటికీ సిబ్బంది స్పందించడంలేదు. 50 శాతంలోపు నష్టం జరిగితే పరిహారం రాదని వారు బదులిస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో రైతులున్నారు. చాలా మండలాల్లో వీఆర్వోలు గ్రామాల్లో పర్యటించలేదంటే అధికారుల మధ్య సమన్వయం, చిత్తశుద్ధి ఎలా ఉందో అర్ధమవుతుంది.
పూసపాటిరేగ, భోగాపురం, మెరకముడిదాం, బొండపల్లి తదితర మండలాల్లో సమాచారం ఇచ్చినా నష్టం జరిగిన పొలాల ఫొటోలు తీసి ఇవ్వండి లేని పక్షంలో మేము గ్రామంలోకి వచ్చేవరకూ ఆగండి అని సిబ్బంది దురుసుగా సమాధానం చెబుతుండడంతో రైతులు ఆవేదనతో రగిలిపోతున్నారు.
వరిపంట వేసిన రైతులకు పరిహారం అందజేసేందుకు సుమారు రూ 16.17 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా అని చెబుతూనే ఏదో ఒకరకంగా నివేదికలు అందజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో విధివిధానాలు రాకపోవ డం వల్లే దృష్టి సారించ లేకపోతున్నామని మరికొంతమంది చెబుతున్నారు. రామభద్రపురం, పూసపాటిరేగ, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో మొక్కజొన్న పంటకు పూర్తిస్థాయిలో నష్టం జరిగినప్పటికీ అధికారులు తమ వద్దకు రాలేదని రైతులు వాపోతున్నారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయించడంతో పాటూ బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు.
ఇంకా బురదలోనే...
భోగాపురం మండలంలో పలు గ్రామాల్లో వీధులన్నీ ఇంకా బురదలోనే ఉన్నాయి. ఇళ్లన్నీ పూర్తిగా వరద మట్టితో నిండిపోవడంతో కాలుపెడితే మోకాలు లోతులో దిగిపోతోంది. దీంతో చాలా మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. బుధవారం వరకూ భోజన సదుపాయం కల్పించిన అధికారులు గురువారం నుంచి ఇక పెట్టబోమని చెప్పేశారు. దీంతో బురదతో నిండిన ఇళ్లలో వంటలు ఎలా చేసుకోవాలని, సరుకులు కూడా పూర్తిగా పాడైపోవడంతో వెచ్చాలు ఎవరు ఇస్తారని, ఎక్కడ భోజనాలు చేయాలని బాధితులు వాపోతున్నారు. వర్షాల కారణంగా అన్నిటితో పాటు పుస్తకాలు కూడా తడిసిపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పాడైపోగా మిగిలిన పుస్తకాలను రోడ్డుపై ఎండపెట్టుకుంటున్నారు. తమకు కొత్త పుస్తకాలు అందజేయాలని వారు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాల అనంతరం గురువారం జిల్లా పరిషత్ వేదికగా అన్నిశాఖల అధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే నిర్వహించనున్న సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయో వేచి చూడాల్సిందే.
ముగ్గురే మృతి..
అకాలవర్షాల కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు నివేదికలు అందజేశారు. కొత్తవలస, జామి మండలాల్లో మృతి చెందిన ఇద్దరి కుటుంబసభ్యులకు రూ. 1.5లక్షల చొప్పున పరిహారం కింద చెక్కులు అందజేశారు. భోగాపురంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా...సాధారణ మరణంగా నమోదు చేశారు. తెర్లాం మండలంలో గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో దాన్ని పెండింగ్‌లో పెట్టారు. అలాగే మెరకముడిదాం మండలం భగీరథపురంలో ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందినప్పటికీ ఆమెకు వారసులు లేకపోవడంతో ఎక్స్‌గ్రేషియా ప్రకటించటానికి వీలుకాదని అధికారులు చెబుతున్నారు. మేనల్లుడు ఉన్నప్పటికీ శవపంచనామా లేకపోవడంతో పరిహారాన్ని అందజేయలేమని, వారసులు లేని వారు మరణిస్తే వారి ఆస్తులు సైతం ప్రభుత్వానికే చెందుతాయని అధికారులు చెబుతున్నారు.
ఉత్తుత్తి సర్వేలు
Published Thu, Oct 31 2013 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement