వచ్చే సాధారణ ఎన్నికలకు తుది ఓటరు జాబితా తయారైంది. శుక్రవారం దీనిని ప్రకటించనున్నారు. విచిత్రమేమిటంటే ఈ జాబితాలో గతంలో కంటే బోగస్ ఓటర్లు పెరగడం. గతంలో వీరు 1,83,180 మంది ఉండేవారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 65,807 మందిని తొలగించారు. అయితే ఇంతకంటే ఎక్కువగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. కొందరు అధి
కార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు భారీగా నకిలీ ఓటర్లను చేర్పించినట్లు తెలుస్తోంది. దీంతో బోగస్ ఓటర్ల సంఖ్య రెట్టిపయింది.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:ఓటు వజ్రాయుధం.. ప్రజాస్వామ్యానికి అది ఆయువుపట్టు. సమర్థులైన నేతలను ఎన్నుకునేందుకు వయోజనులందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన హక్కు. అయితే ఓటరు నమోదులో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కొక్కరూ రెండు, మూడు ఓట్లు కలిగి ఉంటున్నారు.
అలాగే పలు రాజకీయ పార్టీల నాయకులు వివిధ ప్రాంతాల్లోని అనుయాయులను తమ నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్పిస్తున్నారు. ఫలితంగా బోగస్ ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటి తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. కర్నూలు జిల్లాలో బోగస్ ఓటర్ల ఏరివేత ప్రక్రియ ఓ ప్రహసంగా మారింది. తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విమర్శలు ఉన్నాయి. తుది ఓటర్ల జాబితా శుక్రవారం ప్రకటించనుండగా గతంలో కంటే
బోగస్ ఓటర్లు పెరిగినట్లు తెలిసింది.
బోగస్ ఓటర్లు 2,30,541 మంది
జిల్లాలో 42,31,627 మంది జనాభా ఉన్నారు. వీరిలో 18 ఏళ్లపై బడిన వారు 27,11,140 మంది ఉన్నారు. ఇందులో ప్రతి వెయ్యి మందికి 646 మంది ఓటర్లు ఉండాలి. అంటే జిల్లా ఓటర్లు 27,33,631 మంది ఉండాలి. అయితే జిల్లా ఓటర్ల సంఖ్య 29,64,172కు చేరింది. దీంతో 2,30,541 మంది ఓటర్లు ఎక్కువ ఉన్నారు. వీరందరూ బోగస్ ఓటర్లేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. నవంబర్ నెల 18న ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 28,39,937 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,83,180 మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. జాబితా నుంచి వీరిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లినవి సుమోటోగా తీసుకొని తొలగించారు. ఇంటింటికి వెళ్లి కొన్ని బోగస్ ఓట్లను తీసేశారు. ఇలా 65,807 మాత్రమే తొలగించగలిగారు. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నేతలు బోగస్ ఓటర్ల తొలగింపులో అధికారులకు అడ్డుతగిలినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ద్వారా కూడా ఈ రెండు పార్టీలు పోటీ పడి బోగస్ ఓటర్లను చేర్పించినట్లు విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా 1,90,042 మంది కొత్త ఓటర్లు చేరారు. తోలగించిన బోగస్ పోను.. 29,64,172 మందితో తుది ఓటర్ల జాబితా తయారైంది. దీనిని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఇది ప్రామాణికం అవుతుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు కొత్తగా ఓటర్లుగా నమోదయ్యేందుకు అవకాశం ఉంది.
మహిళా ఓటర్లే ఎక్కువ..
జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 14,74,550 మంది పురుషులు ఉంటే 14,89,262 మంది మహిళలు ఉన్నారు. అంటే 14712 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 988 మంది మహిళా ఓటర్లు ఉండాలి. అయితే జిల్లాలో 1010 మంది ఉన్నారంటే మహిళల్లో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారనేది స్పష్టమవుతోంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. కోడుమూరు నియోజకవర్గంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళలు ఒక్కరే ఎక్కువగా ఉన్నారు. పురుషుల ఓట్లు 1,00,094 ఉంటే మహిళల ఓట్లు 1,00,095 ఉన్నాయి. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో మాత్రం మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆలూరులో మహిళల కంటే పురుషులు 1069, పత్తికొండ నియోజకవర్గంలో మహిళల కంటే పురుషులు 729 మంది అధికంగా ఉన్నారు.
పాణ్యం నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు...
ఓటర్ల తుదిజాబితా ప్రకారం జిల్లాలో అత్యధిక ఓటర్లు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండటం విశేషం. ఈ నియోజకవర్గంలో 2,69,341 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత అత్యధికంగా కర్నూలు నియోజకవర్గంలో 2,33,600, ఆ తర్వాత నంద్యాల 2,30,816 మంది ఓటర్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
నకిలీలే అధికం
Published Fri, Jan 31 2014 3:03 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement