2001లో బాణసంచా పేలి ఇద్దరు..
భవానీదీక్షల తొక్కిసలాటలో ఆరుగురు మృతి
వర్షం పడితే అమ్మపైనే భక్తుల భారం
ప్రసాదాల తయారీ సిబ్బందికి ఇన్సూరెన్స్ నిల్
కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో వందమందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 350 మంది గాయపడినట్లు కథనాలు వస్తున్నాయి. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి తొక్కిసలాట జరగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనను చూశాక రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఏ మేరకు భద్రత ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ : దుర్గగుడిలో ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజున తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంసవాహనంపై అమ్మవార్లు, స్వామివార్ల కృష్ణా నదీవిహారం నేత్రపర్వంగా సాగుతుంది. గతంలో హంసవాహనం వెనుకనే ఒక పడవలో బాణసంచా ఉంచి పెద్దఎత్తున కాల్చేవారు. 2001లో ఇదే తరహాలో బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వ అదే బోటులో పడడంతో దేవస్థానానికి చెందిన అటెండర్ సత్యనారాయణ, బాణసంచా కాంట్రాక్టర్ కుమారుడు చనిపోయారు. బోటు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత బాణసంచాను సీతానగరంలో ఉంచి కాల్చడం ప్రారంభించారు. భవానీదీక్షల విరమణ సందర్భంగా 2006 జనవరి మూడవ తేదీ తెల్లవారుజామున ఘాట్‌రోడ్డులో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అనంతరం ఘాట్‌రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. దుర్గగుడికి వచ్చే భక్తులు తమ భద్రతపై అమ్మవారిపైనే భారం వేస్తున్నారు. ముఖ్యంగా ఏమాత్రం వర్షాలు కురిసినా కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండకు మెష్ వేసినా ఫలితం నామమాత్రంగానే ఉంది. వర్షాలు పడినప్పుడు అధికారులు భక్తులకు రక్షణ సూచనలు చేస్తుంటారు. ఆలయం చుట్టూ ఉన్న భవనాలు కొండచరియలు విరిగిపడకుండా కొంతమేరకు కాపాడుతున్నాయి. ఇప్పుడు ఈ భవనాలను తీసివేసి మాడవీధులు నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ఇంద్రకీలాద్రి బలహీనపడి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఘాట్‌రోడ్డులోంచి, మెట్లమార్గం నుంచి రెండు మార్గాలు మాత్రమే కొండపైకి ఉన్నాయి. రెండు మార్గాలకు మధ్యలో దేవాలయం ఉంది. ఘాట్‌రోడ్డు వైపు భారీ ప్రమాదం జరిగితే గుడి దాటి మెట్లమార్గంలోకి వెళ్లి కొండ కిందకు దిగాలే తప్ప.. అదే మార్గంలో తప్పించుకునే అవకాశం లేదు.
ప్రసాదాల తయారీ కేంద్రంలో..
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అమ్మవారి ప్రసాదాల తయారీ కేంద్రంలో నిత్యం లడ్డూ, ప్రసాదాలు తయారుచేస్తుంటారు. గతంలో దీన్ని కాంట్రాక్టరుకు ఇచ్చేవారు. ఇందులో పనిచేసే సిబ్బందికి గ్రూపు ఇన్సూరెన్స్ చేయించిన తరువాతనే కాంట్రాక్టు పనులు ప్రారంభించేవారు. ఇప్పుడు దేవస్థానమే నేరుగా తాత్కాలిక సిబ్బందిని వినియోగించి ప్రసాదాలు తయారుచేయిస్తోంది. దీనికోసం పెద్దపెద్ద పొయ్యిలు, డేగిశాలు వాడుతున్నారు. నిత్యం 50 మందికి పైగా సిబ్బంది పనిచేస్తుంటారు. ఇదే మార్గంలో భక్తులు రాకపోకలు సాగిస్తారు. దేవస్థానం మాత్రం వీరికి గ్రూపు ఇన్సూరెన్స్ చేయించడం లేదు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం దేవస్థానమే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. దీనిపై అధికారులు దృష్టిసారించి సిబ్బందికి, భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.