డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేయాలి
కర్నూలు(రాజ్‌విహార్):
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలన్నింటినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాఫీ చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బీఏస్ కల్యాణ మండపంలో ఆ సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రుణమాఫీపై చంద్రబాబు మాటమార్చడం తగదన్నారు. రివాల్వింగ్ ఫండ్ పేరిట మహిళలను మోసగించే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. గ్రామాల్లో మద్యం బెల్టు షాపులను ఇప్పటి వరకు ఎత్తేయలేదని.. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పురుషులతో సమానంగా విద్య, ఉద్యగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో స్త్రీలు రాణించాలన్నారు. హక్కుల సాధనకు మహిళలందరూ ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళలపై వేధింపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిచలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టం వచ్చినా..హింసలు మాత్రం ఆగడం లేదన్నారు. విజయవాడలో ఈనెల 26 నుంచి రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభలకు జాతీయ కమిటీ నాయకులు హాజరవుతారన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నిర్మల మాట్లాడుతూ.. మ హిళా సమస్యలపై తమ సంఘం నిరంతర పోరు కొనసాగిస్తుందన్నారు. మహా సభలకు జిల్లా అధ్యక్షురాలు జి. ధనలక్ష్మీ అధ్యక్షత వహించగా సహాయ కార్యదర్శులు అలివేలమ్మ, పిఎస్ సుజాత, నగ ర కార్యదర్శి అరుణమ్మ పాల్గొన్నారు.