►వడ్డీ కింద సంఘానికి సగటున రూ. 25వేలు మంజూరు
►జూన్ 3 నుంచి పంపిణీ చేసే అవకాశం
►జిల్లా సమాఖ్య సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం
అనంతపురం సెంట్రల్ : జిల్లాలోని డ్వాక్రా మహిళలకు రూ. 275 కోట్లు లబ్ధి కలుగుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- వెలుగు ప్రాజెక్టు డెరైక్టర్ జి. వెంకటేశం స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి నిధిగా మార్చుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. శనివారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షురాలు పార్వతి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పీడీ వెంకటేశం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ. 10 వేలు చొప్పున మంజూరు చేస్తే, జిల్లాలోని మహిళలకు రూ.
490 కోట్లు లబ్ధి కలుగుతుందన్నారు. తొలివిడతలో రూ. 3 వేలు చొప్పున రూ. 147 కోట్లు మంజూరైందన్నారు. ప్రభుత్వం వడ్డీ కూడా మాఫీ చేయడంతో సరాసరిన సంఘానికి రూ. 22 వేలు చొప్పున వర్తిస్తుందన్నారు. మొత్తం తొలివిడతలో రూ. 275 కోట్లు వస్తుందన్నారు. ఈ మొత్తం జూన్ 3 నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వ్యాపార అవసరాల కోసం ఈ మొత్తాన్ని పెట్టుబడి నిధిగా భావించాలని కోరారు. వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించరాదని సూచించారు.
ఆధార్ అనుసంధానంలో నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 98.4 శాతం మాత్రమే అనుసంధానం అయిందన్నారు. దీనివల్ల మిగిలినవారు ప్రభుత్వం మంజూరు చేస్తున్న నగదును కోల్పోతున్నారన్నారు. ప్రతి మహిళకు ఆధార్‌కార్డు తీయించి ఎన్‌రోల్ చేయాలని ఈసీ మెంబర్లను, వెలుగు సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పార్వతి, కార్యదర్శి పార్వతమ్మ, ఐబీ ఇన్‌చార్జ్ డీపీఎం, ఏసీ గంగాధర్, ఏరియా కో ఆర్డినేటర్ ఈశ్వరయ్య, సబ్జెక్టు యాంకర్ పర్సన్‌లు ఖలీల్, శివప్రసాద్, నారాయణస్వామి, హరిప్రసాద్, జేడీఎం సూర్యానారాయణ వెలుగు అధికారులు, జిల్లా సమాఖ్య ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.
డ్వాక్రా సంఘాలకు రూ. 275 కోట్ల లబ్ధి
Published Sun, May 24 2015 4:17 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement