వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కును డ్వాక్రా మహిళలకు అందిస్తున్న ప్రభుత్వ విప్ పీఆర్కే
మాచర్ల రూరల్(పల్నాడు జిల్లా): ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఐదు మండలాలకు చెందిన డ్వాక్రా సభ్యులకు రూ.4.01 కోట్ల విలువైన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాని వారు ఎవరైనా ఉంటే తనను సంప్రదించవచ్చని, త్వరలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తానే గడపగడపకూ వస్తున్నానని ప్రకటించారు.
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శవంతమైన పాలనను సీఎం జగన్ అందిస్తున్నారని కొనియాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాబు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎంపీపీలు బూడిద మంగమ్మ, దాసరి చౌడేశ్వరి, యేచూరి సునీత శంకర్, శారద శ్రీనివాసరెడ్డి, రూప్లీబాయి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు శేరెడ్డి గోపిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మండ్లి మల్లుస్వామి, యలమంద, మార్కెట్ యార్డు చైర్మన్‌లు వెలిదండి ఉమా గోపాల్, పల్లపాటి గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ జలకళ పథకాన్ని వినియోగించుకోవాలి
మాచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకాన్ని వెనుకబడిన మాచర్ల నియోజకవర్గంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో మెట్ట రైతులు నీరు లేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
రెండున్నర ఎకరాలు ఉన్న రైతులు వైఎస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి బోరు సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ పథకాలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా మెట్ట రైతుల నీటి సమస్య తీర్చేందుకు వైఎస్సార్ జలకళ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోరు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment