డ్వాక్రా మహిళలపై ‘బకాయి’బండ
ఆత్మకూరు: రుణమాఫీ హామీ డ్వాక్రా మహిళలకు అలవిగాని కష్టాలను తెచ్చిపెట్టింది. జిల్లాలో డ్వాక్రా మహిళలకు రుణబకాయిల చెల్లింపు గుదిబండగా మారింది. ఆరు నెలల క్రితం వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి కష్టపడి మరీ వాయిదాలను సక్రమంగానే జమ చేస్తూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చేందుకు డ్వాక్రా రుణాలను రద్దుచేస్తామని ఏ మహిళ సొమ్ము జమ చేయవద్దని గట్టిగా చెప్పిన విషయం తెలిసిందే.
దీంతో గత ఆరు నెలలుగా డ్వాక్రా మహిళలు బ్యాంకులకు సొమ్ము జమ చేయకుండా ఆగిపోయారు. దీంతో జిల్లాలో బకాయిల సొమ్ము కొండలా పేరుకుపోయింది. జిల్లాలోని 46 మండలాల్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సుమారు 36 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 3.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్, ఆత్మకూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు పదివేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి.
ఈ సంఘాల్లో లక్ష మంది దాకా సభ్యులున్నారు. మొత్తం మీద జిల్లాలో 46 వేల సంఘాలు ఉండగా 4.7 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలన్నింటిలో కలిపి సుమారుగా రూ.90 కోట్ల మేర రుణబకాయిలు ఉన్నాయి. వడ్డీ అదనం. గత ఆరు నెలలుగా డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో మహిళలున్నారు.
అయితే ఇటీవల డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు రుణాలు సొమ్మును బ్యాంకులకు జమ చేయాలని అలా చేస్తేనే ఒక్కొక్క సభ్యురాలికి రూ.10వేలు వంతున రుణమాఫీ సొమ్ముగా ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు కొద్దిరోజులనుంచి నచ్చజెబుతున్నారు. దీంతో రుణాలు సొమ్ము జమ చేసేందుకు డ్వాక్రా మహిళలు ప్రైవేటు అప్పులు చేస్తున్నారు.
ఆరు నెలలవి ఒక్కసారిగా అంటే కష్టమే..
గతంలో మాదిరిగానే తీసుకున్న రుణాన్ని బ్యాంకుల్లో జమ చేసి ఉంటే ఈ రోజు ఈ బాధలు తప్పేవని డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామని చెప్పటంతోనే తాము లావాదేవీలు ఆపివేశామని, మళ్లీ అధికారులు జమచేయాలని చెబుతున్నారని వాపోతున్నారు.
ఆరు నెలల సొమ్ము ఒక్కసారిగా ఎలా జమ చేయగలమంటూ డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి అని ఇలా అయితే తమకెందుకు హామీలు ఇచ్చారని మహిళలు మండిపడుతున్నారు. మొత్తం మీద డ్వాక్రా మహిళలకు రుణబకాయిల జమలు ఓ గుదిబండగానే మారాయి.
రికవరీలు ప్రారంభించాం: చంద్రమౌళి, పీడీ, డీఆర్‌డీఏ
ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి రుణాలు పొందిన స్వయం సహాయక సభ్యులు తిరిగి సొమ్ము చెల్లించే ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో డీఆర్‌డీఏ పరిధిలో సుమారు రూ.70 నుంచి 60 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల కాలంలో కొందరు బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం వారికి అవగాహన కల్పించడంతో మళ్లీ ప్రారంభించార.