
ప్రమాణం చేస్తున్న డ్వాక్రా మహిళలు
సాక్షి, విశాఖపట్నం: ‘మీకు చెక్కు–చీర–గొడుగు కావాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని దేవుడి మీద ప్రమాణం చేయాలి. అది కూడా మేము చెప్పినట్లే ప్రమాణం చేయాలి. లేదంటే మీకు రూ.10 వేల చెక్కు, చీర, గొడుగు ఇవ్వం’. ఇదీ టీడీపీ నేతల బరితెగింపు. అసలేం జరిగిందంటే ..గురువారం సాయంత్రం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 26వ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం పంచుతున్న ‘పసుపు–కుంకుమ చెక్కుల కోసం ఆ వార్డులో ఉన్న డ్వాక్రా మహిళలు హనుమాన్ ఆలయానికి వచ్చారు.
ఈ ఆలయంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చిన్న కుమారుడు రాజేష్ చేతుల మీదుగా చెక్కులు, చీరలు, గొడుగులు పంపిణీ చేశారు. అంతకన్నా ముందు హనుమాన్ ఆలయంలో డ్వాక్రా మహిళలతో ‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని, ఎవరి ఒత్తిడికి .. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వబోమని దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. తప్పని పరిస్థితుల్లో ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలంతా ప్రమాణం చేయక తప్పలేదు. మున్సిపల్ కౌన్సిలర్ పైల గోవింద్, వార్డు మాజీ మెంబర్, రిటైర్డ్ టీచర్ రుత్తల తాతీలు పాల్గొని డ్వాక్రా మహిళలతో ప్రమాణం చేయించారు.
కాగా సీఎం చంద్రబాబునాయుడు తరఫున పసుపు–కుంకుమ కింద మహిళలకు రూ.10 వేలు ఇస్తుంటే.. మా కుటుంబం తరఫున మహిళలకు చీరలు ఇస్తున్నామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగ సభల్లో చెబుతున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో మంత్రి సతీమణి పద్మావతి, తనయులు విజయ్, రాజేష్ తమ అనుచరులతో ముందస్తు ఎరగా ముమ్మరంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. ఏదో చీర ఇస్తామంటే వెళ్లాం కానీ.. భగవంతుడి సన్నిధిలో పిల్లా పాపలతో ఉన్న తమచేత ప్రమాణం చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment