
రుణమాఫీపై మహిళల కన్నెర్ర
* సీఎఫ్‌ను నిలదీసిన డ్వాక్రా సంఘాల సభ్యులు
* మాఫీ సొమ్ము ఖాతాలో వేసేవరకూ సంతకాలు చేయబోమని స్పష్టీకరణ
సూర్యమణిపురం(వజ్రపుకొత్తూరు): డ్వాక్రా రుణమాఫీపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ పంచాయతీ సూర్యమణిపురం గ్రామ స్వయంసహాయక సంఘాల మహిళలు కన్నెర్ర చేశారు. మాఫీ మాయాజాలంపై కమ్యూనిటీ ఫెసిలిటేటర్(సీఎఫ్)ను నిలదీశారు.
పంచాయతీకి చెందిన సీఎఫ్ బి.ఉమ ఆదివారం సూర్యమణిపురం గ్రామానికొచ్చి స్వయంసహాయక సంఘానికి ఇచ్చే పెట్టుబడి నిధి పత్రాన్ని సభ్యులకు చదివి వినిపించి సంతకాలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ అగస్థీశ్వర, పార్వతి, ఉషోదయ, వెంకటేశ్వర స్వయంసహాయక సంఘాలకు చెందిన 40 మంది మహిళలు ఆమెను చుట్టుముట్టారు. మాఫీ సొమ్ము ఖాతాలో వేసేవరకూ సంతకాలు చేసేది లేదని కుండబద్దలు కొట్టారు.
మాఫీ మాయలో మరోసారి తమను బలిపశువులు చేసి సంతకాలు తీసుకోవద్దని, రుణమాఫీని పూర్తిస్థాయిలో తమ ఖాతాలకు జమ చేస్తేనే సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.1.50 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేడు రూ.3 వేలు కూడా ఖాతాలకు జమ చేయకుండా తమను వంచనకు గురిచేసి సంతకాలు తీసుకోమని పంపించాడా? అంటూ ఆమెను నిలదీశారు.
ఈ సందర్భంగా పైల ఎర్రమ్మ అనే డ్వాక్రా మహిళ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు 60 ఏళ్లని, తామంతా రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్నామని చెప్పింది. రుణమాఫీ సొమ్మంతా ఒకేసారి ఖాతాలో వేయకుండా తాము తనువు చాలించాక వేస్తారా? అంటూ మండిపడింది. చంద్రబాబు మాటలకు మోసపోయామని, స్వయంసహాయక సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ కోనేరు అనసూయ, పల్లి అనురాధ, డి.ఆరుద్ర, జి.రాజేశ్వరి తదితర మహిళలు మండిపడ్డారు.