ఏర్పాటుకు ప్రభుత్వ ఆలోచన
అమలుతీరుపై అనేక అనుమానాలు
కర్నూలు: స్నేహ చికెన్ షాప్.. బాషా చికెన్ షాప్.. రెడ్డి చికెన్ షాప్.. ఈ తరహాలో ఇక నుంచి డ్వాక్రా చికెన్ షాపులు కూడా దర్శనమివ్వనున్నాయి. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చికెన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చికెన్ షాపులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.
అయితే, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ చికెన్ షాపులకు అవసరమయ్యే కోళ్లను ఎక్కడి నుంచి సరఫరా చేయాలి? ధర ఎంత మేరకు నిర్ణయించాలనే విషయాలతో పాటు వ్యాపారంలో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా చికెన్, గుడ్ల వినియోగాన్ని పెంచేందుకు ఈ తరహా ప్రయోగాలు చేయనున్నట్టు ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి.
ఏ ఒక్కటీ అమలు కాదే..
వాస్తవానికి డ్వాక్రా సంఘాలను కేవలం పొదుపునకే పరిమితం చేయకుండా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి పలు వ్యాపారాల్లో శిక్షణ కూడా ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన. ఏకంగా డ్వాక్రా సంఘాలకు పూచీకత్తు లేని రుణాలను ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేది కూడా ప్రభుత్వ నిర్ణయంగా ఉంది.
అయితే, ఇప్పటివరకు ఈ ప్రక్రియ కాస్తా పెద్దగా ముందుకు సాగింది లేదు. అదేవిధంగా మునిసిపాలిటీ, కార్పొరేషన్లల్లో రూ.5 లక్షల వరకు పనులను నామినేషన్ పద్ధతిలో డ్వాక్రా సంఘాలకు అప్పగించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం రెండు నెలల కిందట ఏకంగా ఉత్తర్వులు జారీచేసింది.
అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పని కూడా డ్వాక్రా సంఘాలకు అప్పగించిన పాపాన పోలేదు. ఇదే తరహాలో జనరిక్ ఔషధాలను డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పాలని డీఆర్‌డీఏ పథక రచన చేసింది. ఇది కూడా ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చికెన్ షాప్‌ల ఏర్పాటు ప్రక్రియ అయినా ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానం కలుగుతోంది.
పీపీపీ పద్ధతిలోనూ..
డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో చికెన్ షాపులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో కూడా చికెన్ షాప్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్లో చికెన్ షాపులను ఏర్పాటు చేయాలనేది ఈ పీపీపీ విధానంలో భాగం. అయితే, ఇంకా ఈ విధానం విధివిధానాలు ఖరారు కాలేదని అధికారులు చెబుతున్నారు.