వంచనపై ఉరిమి.. దగాపై రగిలి.. | Make YSRCP's Maha Dharna a big success | Sakshi
Sakshi News home page

వంచనపై ఉరిమి.. దగాపై రగిలి..

Published Sat, Dec 6 2014 12:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

వంచనపై ఉరిమి.. దగాపై రగిలి.. - Sakshi

వంచనపై ఉరిమి.. దగాపై రగిలి..

గద్దెనెక్కడమే ధ్యేయంగా ప్రజలను నానా వాగ్దానాలతో ఊరించిన చంద్రబాబు.. తీరా అధికారం దక్కాక వారి జీవితాల్లో కనీసపు వెన్నెలను ప్రసరించడానికి ప్రయత్నించడం అటుంచి.. తనలోని చీకటి కోణాన్ని మరింత విశ్వరూపంలో ప్రదర్శిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ నుంచి ఇంటికో ఉద్యోగం వరకూ పెక్కు హామీలను సీఎం సింహాసనాన్ని అధిష్టించేందుకు సోపానాలుగా వాడుకున్న ‘బాబు’.. తర్వాత జనజీవితాన్ని జారుడుమెట్లపైకి నెట్టారు. ఈ నయవంచనపై జనం నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ సర్కారు కుటిలనీతిని ఛీత్కరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరిగిన మహాధర్నాకు పోటెత్తిన జనం.. ఒక్కొక్కరూ ఒక్కో ‘అగ్నికణం’లా రగలడమే అందుకు నిదర్శనం.
 
- మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచీ వెల్లువెత్తిన జనం
- వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిపి సర్కారుపై నిరసన గళం
- బాబు ఆరునెలల పాలనపై ఆగ్రహాన్ని ప్రతిబింబించిన ఆందోళన

సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాట తప్పిన చంద్రబాబు సర్కారుపై పెల్లుబికిన జనాగ్రహానికి కాకినాడలోని కలెక్టరేట్ వేదికైంది. ప్రజలను అనేక విధాలుగా దగాచేసిన సర్కార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునందుకుని జిల్లా ప్రజలు శుక్రవారం నాటి మహాధర్నాకు తరలివచ్చారు. రుణమాఫీ హామీని నమ్మి భంగపడ్డ రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు పింఛన్లు రాని పండుటాకులు సైతం ప్రయాసను లెక్కచేయక పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొనడం సర్కారుపై ప్రజా వ్యతిరేకతకు దర్పణం పట్టింది. ధర్నాకు వైఎస్సార్ సీపీ పిలుపు ఇచ్చినా పార్టీ రహితంగా వివిధ వర్గాలు ధర్నాకు సంఘీభావం తెలపడంతో ఆరునెలల చంద్రబాబు పాలనపై నెలకొన్న వ్యతిరేకత ప్రస్ఫుటమైంది.  
 
జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు వారికి సంఘీభావంగా రైతులు, మహిళలు, వృద్ధులు కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. ధర్నాకు తరలివచ్చిన జనంతో కలెక్టర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జనం, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు..ఇలా అందుబాటులో ఉన్న వాహనాలపై సర్కార్ దగాను ఎండగట్టేందుకు తరలివచ్చారు. జగ్గంపేట నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో మెట్ట ప్రాంత పార్టీ శ్రేణులు, రైతులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో తరలిరాగా, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్‌లు తమ తమ నియోజకవర్గ కేంద్రాల నుంచి కేడర్, రైతులు వెంట రాగా వాహనాల్లో కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
 
అవరోధాల్ని అధిగమించి..
మహాధర్నాకు వైఎస్సార్ సీపీ ముందుగానే పిలుపు ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు కలెక్టరేట్‌కు వచ్చే మార్గాలన్నింటికీ అడ్డంగా ట్రాఫిక్ గేట్‌లు ఏర్పాటుచేసి మూసేశారు. వాహనాలను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పోలీసుల ఆటంకాలను సైతం లెక్కచేయకుండా రైతులు, స్వయంశక్తి సంఘాల మహిళలు, పార్టీ శ్రేణులు ట్రాఫిక్‌గేట్లను దాటుకుంటూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరిగిన ఆందోళనలో ఏ ఒక్కరూ చివరి వరకూ వీడి వెళ్లలేదు. సూరీడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా జనం..పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ముఖ్యనేతలు జాయింట్ కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందించి తిరిగొచ్చే వరకు కలెక్టరేట్‌ను విడిచి వెళ్లలేదు. ధర్నాలో నెహ్రూ సహా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,కో ఆర్డినేటర్‌లు...ఇలా దాదాపు నేతలు చంద్రబాబు రుణమాఫీపై చేసిన మోసాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
 
సర్కార్ నిర్వాకాన్ని ఎండగట్టిన ప్లకార్డులు
కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్‌లు ఏర్పాటు చేసిన ప్లకార్డులు ఆలోచింపచేశాయి. ‘వినేవాడు వెర్రిబాబు అయితే చెప్పే వాడు చంద్రబాబు అట’, ‘బాబు హామీలు ఎండమావిలో నీళ్లు’,  ‘చంద్రబాబు పాలనలో ఆరు నెలలు-50 మోసాలు’, ‘ఎకానమిస్ట్ అన్నాడు-ఏక నామం పెట్టాడు’, ‘అధికారం కోసం అప్పుడు బాబు అన్నిటికీ సై..సై-ఆంక్షల పేరిట ఇప్పుడు మాత్రం నై..నై..’ వంటి ప్లకార్డులతో మహిళలు, రైతులు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారు.
 
సొమ్మసిల్లిన విశ్వరూప్, పాపారాయుడు
ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు సొమ్మసిల్లిపోయారు. మహాధర్నా ప్రారంభానికి ముందు విశ్వరూప్, పాపారాయుడు బిగ్గరగా అరుస్తూ రుణమాఫీపై దగా చేసిన చంద్రబాబు సర్కార్‌ను ఎండగడుతున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. వైద్యుడైన పార్టీ అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి హుటాహుటిన పాపారాయుడును పరీక్షించారు. అనంతరం నేతలు సపర్యలు చేయడంతో కొద్దిసేపటికి తేరుకున్నారు. కాగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా నిశ్చితార్థం ఏర్పాట్లతో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, విశాఖలో జరిగే మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పాల్గొనడంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కాకినాడ ధర్నాకు హాజరు కాలేకపోయారు. మరో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వ్యక్తిగత పనులుండడంతో కార్యక్రమానికి రాలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement