రుణమాఫీ బూటకం
- రైతులను మోసగిస్తున్న చంద్రబాబు
- జిల్లావ్యాప్తంగా నిరసనలు
- అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీ బూటకమని, షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపట్నంలో నరకాసుర వధ దిష్టిబొమ్మ దహనం చేసినవారిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, పలువురు రైతువిభాగం నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం వారిని మోసం చేయడం తగదన్నారు. రైతులకు, మహిళలకు రుణాలు మాఫీ అయ్యేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని, వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, ఎస్సీ, ఎస్టీల రుణాలన్నీ రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడంతో ప్రజలు ఆయన మాటలు నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుణమాఫీపై సంతకం చేయకుండా...ఎలా మాఫీ చేయాలనే అంశంపై ఏర్పాటు చేసే కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సంతకం చేయడం దారుణమన్నారు. ప్రజల ఆశలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వమ్ము చేస్తున్నాడన్నారు. తాము ప్రజల కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.
- మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నేతృత్వంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతు విభాగం కో ఆర్డినేటర్ ఉడుముల కోటిరెడ్డి పాల్గొన్నారు.
- పుల్లలచెరువులో యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుంచి పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
- సంతనూతలపాడు బస్టాండ్ ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. పలుచోట్ల వైఎస్సార్ సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
చాలాచోట్ల నాయకులను పిలిచి బెదిరించారు. అయినా వారు ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆందోళనల్లో పాల్గొన్నారు. సంతనూతలపాడులో తెలుగుదేశం నాయకులు పోటీగా కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్ సీపీ ఆందోళనకు ప్రతిగా చంద్రబాబుకు అభినందన సభపేరుతో కార్యక్రమం పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇక్కడ మూడు గంటలకుపైగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధవీడు మండల కేంద్రంలో ఎంపీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లూరులో సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను ఊరేగించారు. వెల్లంపల్లి రోడ్డు, తహ శీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి కార్యకర్తలు పూనుకోగా ఒక్కసారిగా ఎస్సై, సిబ్బంది కార్యకర్తల నుంచి దిష్టిబొమ్మను లాక్కున్నారు.