చేతగాకపోతే గద్దె దిగండి
* రైతులు, మహిళలను మోసం చేసిన చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవాలి
* జిల్లాలో 59 మంది రైతుల ఆత్మహత్యలకు బాబే కారణం
* రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను పూర్తిగా వెంటనే మాఫీ చేయాలి
* హామీలు అమలు చేయకపోతే సర్కారుపై దండయాత్ర
* ఇది ఆరంభం మాత్రమేనని వైఎస్సార్‌సీపీ ధర్నాల్లో నేతలు, రైతులు, మహిళల హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, అనంతపురం :‘రైతులు కష్టాల్లో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారు. గద్దెనెక్కి ఐదునెలలు దాటుతున్నా రుణమాఫీ చేయలేదు. లేనిపోని సాకులు చెబుతున్నారు. రుణమాఫీ ఇక అమలు కాదని జిల్లా వ్యాప్తంగా ఈ ఐదు నెలల్లో 59 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇవన్నీ సర్కారు హత్యలే. వీటికి చంద్రబాబే బాధ్యత వహించాల’ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. రైతు, డ్వాక్రా రుణాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏఒక్క హామీని చంద్రబాబు సర్కారు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
* అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం పాల్గొన్నారు.
* ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పడం వల్ల డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమయ్యాయని ఆయన విమర్శించారు.
* కదిరిలో ఎమ్మెల్యే చాంద్‌బాషా ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
* పెనుకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 99 అబద్ధాలు ఆడి చంద్రబాబు సీఎం అయితే.. రుణాలు మాఫీ చేయలేనని ఒక్క నిజం చెప్పి వైఎస్ జగన్ అధికారానికి దూరమయ్యారని వెంకట్రామిరెడ్డి అన్నారు.
* రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రాప్తాడు, అనంతపురం, కనగానపల్లి ధర్నాల్లో పాల్గొన్నారు.
* హిందూపురం ధర్నాలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడారు. రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలన్నారు.
* కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు దద్దమ్మలని, రుణమాఫీ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని మండిపడ్డారు.
* పుట్టపర్తి ధర్నాలో సమన్వయకర్త సోమశేఖరెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన బాబును చరిత్ర క్షమించదన్నారు.
* శింగనమలలో సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
* రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
* తాడిపత్రిలో సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మాని, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగించి భయానక పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
* ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
* మడకశిరలో సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ మోసం చేయడంలో తనకు తానేసాటి అని చంద్రబాబు నిరూపించుకున్నారని విమర్శించారు.