బాబూ.. ఆమెకు చోటేదీ?
మాటల్లోనే మహిళా సాధికారత
‘మహిళా సాధికారత మా వల్లే సాధ్యం. డ్వాక్రా రుణాలు తెచ్చింది మేం. రిజర్వేషన్ల కోసం పోరాడింది మేం. స్త్రీల రక్షణ మావల్లే సాధ్యం’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతుంటారు. అయితే ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నా..
ఒక్క మహిళకు కూడా టికెట్ కేటాయించలేకపోయారు. కాంగ్రెస్‌లో ఇదే పరిస్థితి కనిపించింది. ఆ పార్టీ తరఫున ఆలూరు నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకంగా ముగ్గురు మహిళలకు చోటు కల్పించింది. కర్నూలు పార్లమెంట్, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాల నుంచి బుట్టా రేణుక, భూమా శోభా నాగిరెడ్డి, చరితారెడ్డిని బరిలోకి దింపింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు,రైతు, డ్వాక్రా రుణాలు రద్దుచేస్తామని టీడీపీ అధినేత హామీ ఇవ్వడం.. వారి ఓట్లను దండుకోవటానికేనని తేలిపోయింది. జిల్లాలో మొత్తం ఓటర్లు 29,64,148 ఉన్నారు. అందులో మహిళా ఓటర్లే 14,88,875 ఓటర్లు ఉన్నారు. అంటే సగానికి పైనే మహిళా ఓటర్లు ఉన్నారు. 1952 నుంచి లోక్‌సభకు 15 పర్యాయాలు, శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు జిల్లా నుంచి కేవలం ఐదుగురు మాత్రమే చట్టసభల్లో అడుగుపెట్టారు.
1962లో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా యశోదారెడ్డి పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మహిళలకు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన దాఖలాలు లేవు. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుట్టా రేణుకకు కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది. ఈ ఘనత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందనటంలో సందేహం లేదు.
1985లో పత్తికొండ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కె. మహాబలేశ్వరగుప్త హత్యకు గురయ్యారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ఆయన సతీమణి కె. సుబ్బరత్నమ్మకు టికెట్ ఇచ్చారు. ఆ తరువాత 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికలో, 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేసి గెలుపొంది ఆసెంబ్లీలో అడుగుపెట్టారు.
అసెంబ్లీకి ఎన్నికైన రెండోమహిళగా శోభా నాగిరెడ్డికి స్థానం దక్కింది. తరువాతి స్థానంలో గౌరు చరితారెడ్డి, కోట్ల సుజాతమ్మలు నిలిచారు. 2004లో జరిగిన ఎన్నికల్లో గౌరు చరితారెడ్డి, కోట్ల సుజాతమ్మ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 సాధారణ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి, నీరజారెడ్డి విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
పార్టీనే నమ్ముకుని ఉన్న మహిళలు..
దివంగత ఎన్‌టీ రామారావు నుంచి నేటి వరకు పార్టీ కోసమే పనిచేస్తూ.. టీడీపీనే నమ్ముకుని పనిచేస్తున్న మహిళలు ఉన్నారు. వారిలో మసాల పద్మజ, గుడిసె క్రిష్ణమ్మ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఉన్నారు. ఈ ముగ్గురూ టికెట్లు ఆశించిన వారే. ఓ సారి మసాల పద్మజకు ఎమ్మెల్సీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గుడిసె క్రిష్ణమ్మను ఆదోని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించి పార్టీ నాయకులే ఓడించారని ప్రచారం ఉంది.
ఇక బొజ్జమ్మ విషయానికి వస్తే తండ్రి కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్యకు గురైనప్పటి నుంచి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే కుదరదని చెప్పేశారు. ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే మాటలకు.. చేతలకు పొంతనే ఉండదని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పి తీరుతారని మహిళలు హెచ్చరిస్తున్నారు.