మాఫీ వంచనపై మహాగ్రహం !
సాక్షి, విజయనగరం: బంగారం లాంటి పంటలు నష్టపోయినా... ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రైతులు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తే కుటుంబ పోషణకు ఆసరా అవుతుందని సంబరపడ్డ మహిళలు, పింఛను ఐదింతలు పెరిగితే రెండు పూటలా కడుపునింపుకోవచ్చనుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బాబు వస్తే జాబు వస్తుందని నమ్మి వీధి పాలైన యువకులు..హుద్ హుద్ తుపాను మిగిల్చిన కష్టంలో ఉన్న వారు.. ఇలా ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా చంద్రబాబు చేతిలో వంచనకు గురైన ప్రజలందరూ ఒక్క సారిగా తమ గెండెల్లోని బాధను బయటపెట్టారు. పచ్చి మోసాలకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిన దించారు. వైస్సార్(వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన మహాధర్నాలో దుమ్మెత్తిపోశారు.
పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జన సమూహం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ట వీరభద్రస్వామి ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి రెండు వేల ద్విచక్రవాహనాలతో 11.40 గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలు దేరారు. కోట జంక్షన్, గంట స్తంభం, వైఎస్సార్ జంక్షన్, ఆర్‌అండ్‌బీ, పోలీస్ బ్యారెక్స్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. అప్పటికే కలెక్టరేట్ వద్దకు వేలాది మంది ప్రజలు చేరుకుని వేచి ఉన్నారు . కళాకారులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గళమెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహాధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను ఎండగట్టారు. ‘ఎన్నికల మేనిఫెస్టో’పై చంద్రబాబు లేదా విజయనగరం జిల్లా టీడీపీ నేతలెవరైనా బహిరంగ చర్చకు వస్తారా?’అని సవాలు విసిరారు. ఎన్నికల హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిన చంద్రబాబు మాటలను ఆ పార్టీ వారే నమ్మలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి అర్హులకు పింఛన్లు ఇవ్వకపోయినా, అనర్హులకు ఇచ్చినా ప్రజల తరఫున న్యాయస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. ఈ మహా ధర్నా ఆరంభం మాత్రమేనని, ఎన్నికల హామీలు నెరవేర్చేంతవరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అంధించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ బి.రామారావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు.
అడుగడుగునా అవాంతరాలు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా విజయవంతం కాకుండా ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోవాలని చూసింది. ఓ వైపు ధర్నాకు అనుమతిస్తూనే మరోవైపు పట్టణంలోకి వచ్చే జన ప్రవాహానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. జనం ధర్నాకు రాకుండా చేసి, కార్యక్రమాన్ని విఫలం చేయాలని భావించింది. దానిలో భాగంగా నగరానికి వచ్చే అన్ని దారుల్లోనూ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. జనం వచ్చే వాహనాలను నిలిపివేసి ఆ పత్రాలు, ఈ పత్రాలు అంటూ హడావుడి చేశారు. పలు వాహనాలకు జరిమానాలు విధించారు. కొన్నింటిని వెనక్కు పంపించేశారు. మరికొన్నింటిని శివారుల్లోనే నిలిపివేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అదరలేదు, బెదరలేదు. ప్రభుత్వ కుట్రలను ముందే ఊహించి కొన్ని వాహనాలతో జనాలు ఉదయమే పట్టణంలోకి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్న వాహనాల్లోని జనం కాలినడకన కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నప్పటికీ సంయమనం పాటించి శాంతి యుతంగా ధర్నా నిర్వహించి విజ్ఞతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ పరిశీలకుడు ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు ( బేబినాయన), విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ డెరైక్టరు కేవీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, సవరపు జయమణి, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, నెల్లిమర్ల సమన్వయకర్త డాక్టరు పెనుమత్స సురేష్‌బాబు, ఎస్‌కోట సమన్వయకర్త నెక్కలి నాయుడుబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎస్సీ సెల్ విభాగం నాయకుడు జైహిందుకుమార్, రైతు విభాగం నాయకుడు సింగుబాబు, యువజన నాయకులు అవనాపు విజయ్, జెడ్పీ మాజీ చైర్మన్ గుల్లిపల్లి సుదర్శనరావు, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ మామిడి అప్పలనాయుడు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.