లెక్కల గుర్రంపై టక్కరి సవారీ! | AP presents a tax-free budget for 2016-17 | Sakshi
Sakshi News home page

లెక్కల గుర్రంపై టక్కరి సవారీ!

Published Fri, Mar 11 2016 2:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

లెక్కల గుర్రంపై టక్కరి సవారీ! - Sakshi

లెక్కల గుర్రంపై టక్కరి సవారీ!

‘ఏదైనా సార్ధకంగా నేర్చుకున్నపుడు సృజనాత్మకత వికసిస్తుంది’ మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం చెప్పిన ఈ మాటతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ‘సృజనాత్మకత గారడీ’ని చక్కగా ఆవిష్కరించారు. అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన 600 హామీలలో ఏ ఒక్క హామీనీ పాక్షికంగా కూడా నెరవేర్చలేకపోయిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లోనూ వాటిని అస్సలు పట్టించుకోలేదు. కొన్ని హామీలకు మాత్రం అరకొర విదిలింపులతో సరిపెట్టింది. యనమల బడ్జెట్ యావత్తూ ‘మాటల మూటలు.. అంకెల గారడీ’....గా సాగింది.

ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగ పాఠం పేజీలు 48కి పెరిగాయి గానీ ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు పెరగలేదు. 150 నిమిషాల సేపు సాగిన బడ్జెట్ ప్రసంగంలో సర్కారు లేనిపోని గొప్పలకే సింహభాగం కేటాయించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులకు మాత్రం ఈ బడ్జెట్ అంతులేని నిరాశను మిగిల్చింది. లక్షన్నర కోట్లకు చేరుకుంటున్న బడ్జెట్‌లో బడుగుజీవుల ‘లెక్క’ మాత్రం ఎప్పటిలానే తప్పిపోయింది...   

- సాక్షి, హైదరాబాద్కోటదాటిన మాటలు.. గడపదాటని హామీలు..
 
హామీలంటే అంత నిర్లక్ష్యమా...

ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరుసగా మూడో బడ్జెట్‌లోను మంగళం పలికింది. రైతు రుణమాఫీకి అరకొరగా కేటాయించి చేతులు దులుపుకున్నారు. డ్వాక్రా రుణాల మాఫీకి మరోమారు మొండిచేయి చూపించారు. నిరుద్యోగ భృతికి అసలు కేటాయింపులే లేవు. చేనేత కార్మికులకు వెయ్యి కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తాననే హామీనీ విస్మరించారు.  డ్వాక్రా మహిళా సంఘాల వడ్డీ లేని రుణాలకు, రైతులకు వడ్డీ లేని రుణాలకు అరకొరగా నిధులను విదిల్చారు.

ఆరోగ్య శ్రీకి రూ.917 కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదించగా కేవలం రూ. 500 కోట్లతో సరిపుచ్చారు. వికలాంగులు, వృద్ధులు, వితంతు పింఛన్లకు 5,455 కోట్ల రూపాయలు అవసరం ఉండగా బడ్జెట్‌లో కేవలం రూ.2,998 కోట్లనే కేటాయించారు. గ్రామీణ ప్రాంతంలోనే పేదల గృహాల నిర్మాణానికి రూ.5,500 కోట్లు అవసరం ఉండగా రూ. 1,132 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. నిరుద్యోగ భృతికి కేటాయింపులను పక్కన పెట్టేసి యువసాధికారికత పేరుతో రూ. 252.38 కోట్లను కేటాయించారు.

రాష్ట్ర జనాభాలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులు 31 శాతం అంటే కోటి 55 లక్షల మంది ఉన్నారని పేర్కొన్న ఆర్థిక మంత్రి ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పనే మా ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీకి బడ్జెట్‌లో మంగళం పలికారు. ముఖ్యమంత్రి  విచక్షణాధికారంతో తనకు నచ్చిన ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) కింద రూ.487 కోట్లను కేటాయించారు.
 
రైతు రుణమాఫీ దారుణమైన మోసం..
రైతు రుణమాఫీపై రెండేళ్ల క్రితం చెప్పిన మాటలనే ఆర్థికమంత్రి మరోమారు వల్లెవేశారు. రుణమాఫీని నాలుగువిడతల్లో పూర్తిచేస్తామని ఆయన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే కేటాయింపులు మాత్రం అందుకు అనుగుణంగాా లేవు.  రైతు రుణ మాఫీకి ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 4,300 కోట్లు ఇప్పటికీ విడుదల చేయని సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రైతుల రుణ మాఫీకి కేవలం రూ. 3,512 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మొత్తం వడ్డీకి కూడా ఒక మూలకు సరిపోదని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్న చంద్రబాబు పగ్గాలు చేపట్టగానే ఆ హామీని అటకెక్కించేశారు. అనేక ఆందోళనల తర్వాత రుణమాఫీ మొదలుపెట్టినా రైతులను దారుణంగా వంచించారు. 2014 మే నాటికే రైతుల రుణాలు రూ. 87,612 కోట్లు.

ఈ రెండేళ్లలో దానిపై వడ్డీ దాదాపు రూ. 25 వేల కోట్లు అయ్యింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కలుపుకుంటే దాదాపు రూ. 40 వేల కోట్లకు పెరుగుతుంది. అయితే రుణమాఫీకి ఇప్పటి వరకు ఇచ్చింది చూసుకుంటే రూ. 7,300 కోట్లు, ఇపుడు రూ. 3,500 కోట్ల కేటాయింపులు. వెరసి రూ. 10,800 కోట్లు మాత్రమే. అంటే వడ్డీలో పావు వంతు అన్నమాట. ఇదీ బాబుగారు చేస్తున్న రైతు రుణమాఫీ.
 
డ్వాక్రా మహిళలదీ అదే వ్యథ..
ఎన్నికల ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. 2014-15లో రూ. 14,024 కోట్ల రుణాలున్నాయి.అందులో ఇప్పటివరకు ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు. మూడు బడ్జెట్‌లలో వారికి మొండిచేయి చూపించారు. ఏ బడ్జెట్‌లోనూ డ్వాక్రా రుణ మాఫీకి నిధులు కేటాయించలేదు. పెట్టుబడి నిధిగా పది వేల రూపాయలిస్తున్నానని ప్రకటించినా అది కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు.

80.77 లక్షల మందికి మూడువేల రూపాయల చొప్పున రూ.2,423 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ ఏడాది రెండోవిడతగా మూడువేల చొప్పున పెట్టుబడినిధికి చెల్లించాలంటే రూ. 2,423 కోట్లు అవసరంకాగా బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. వాటిని ఎంతమందికి సర్దుతారు. ఎంతమందికి మొండిచేయిచూపిస్తారు?
 
నిరుద్యోగులకు మొండిచేయి

ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటికో ఉద్యోగమన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగాలు ఇవ్వక పోగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకడం మొదలుపెట్టారు. దాదాపు 30 వేల మందిని ఇంటికిపంపించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. అందుకు యనమల ప్రవేశపెట్టిన రాష్ర్ట బడ్జెట్ ప్రత్యక్ష నిదర్శనం. ఈ బడ్జెట్‌లోనూ నిరుద్యోగ భృతికి ఎలాంటి నిధులనూ కేటాయించలేదు.
 
కాగితంపైనే భారీ కేటాయింపులన్నీ..

రెవెన్యూ లోటు రూ. 4,868 కోట్లు,  ద్రవ్యలోటు రూ.20,497 కోట్లుగా ఉంటుందని 2016-17 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు  అంచనా వేశారు. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికే వెచ్చించనున్నారు. గతంలో ప్రణాళికేతర పద్దు కింద ఉన్న ఆరోగ్యశ్రీ, కాపులు, బ్రాహ్మణులకు సాయం, రాష్ట్ర ఆర్థిక గ్రాంట్లను ఇప్పుడు ప్రణాళికా పద్దులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రణాళిక వ్యయం భారీగా పెంచినట్లు చూపించారు.

ప్రణాళిక పద్దు కింద రూ. 49,134 కోట్లను వ్యయం చేయనున్నట్లు ప్రతిపాదించారు. ఈ సారి  కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాయం అదనంగా రూ.7,795 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ప్రణాళిక వ్యయాన్ని రూ.49,134 కోట్లకు పెంచడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు కేటాయింపులు భారీగా చేశామని కాగితాలపై చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఐతే కేటాయింపులకు వాస్తవ వ్యయానికి పొంతన ఉండటం లేదు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 5,700 కోట్ల రూపాయలను కేటాయించగా ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ. 4,045 కోట్లకు కుదించారు. అంటే రూ.1,735 కోట్లు కోత విధించారు. అలాగే, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికల తీరు ఇలాగే ఉంది. మరో పక్క గృహాలు, పింఛన్లు, ఫీజులు, తదితర రంగాల వ్యయాలన్నీ ఉప ప్రణాళికల నుంచే చేయనున్నారు.
 
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకే ద్రవ్యలోటు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు రూ. 20,497 కోట్లుగా పేర్కొన్నారు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.99  శాతంగా పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బీఏం చట్టానికి లోబడి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
కేంద్రంపైనే ఆశలు...

ఈసారి బడ్జెట్‌లో కేంద్రం నుంచి అధికంగా గ్రాంట్లు వస్తాయని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనక పోయినప్పటికీ ఆర్థిక మంత్రి మాత్రం రూ.7,500 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సత్వర సాగునీటి ప్రయోజన  కార్యక్రమం ద్వారా రూ. 3,500 కోట్లు వస్తాయని, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీ నిమిత్తం రూ.3,000 కోట్లు వస్తాయని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాజధాని నిమిత్తం ఈ ఏడాది రూ.1,000 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని ఆశిస్తున్నామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement