‘కోవిడ్‌’ దెబ్బ.. ఇ–కామర్స్‌ విలవిల! | E Commerce Affected Due To Kovidh In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘కోవిడ్‌’ దెబ్బ.. ఇ–కామర్స్‌ విలవిల!

Published Fri, Feb 14 2020 4:52 AM | Last Updated on Fri, Feb 14 2020 4:52 AM

E Commerce Affected Due To Kovidh In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : చైనాను వణికిస్తున్న కోవిడ్‌ (కరోనా వైరస్‌) ధాటికి ఇ–కామర్స్, ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారం కుదేలైంది. చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడం దేశీయ వ్యాపార రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. 31.50 బిలియన్‌ డాలర్ల విలువైన దేశీయ ఇ–కామర్స్‌ వ్యాపారం చైనాలో నెలకొన్న పరిణామాలతో మందగించింది. మన రాష్ట్రంలో ఏటా 50 మిలియన్ల ఫోన్లు తయారవుతుండగా దేశవ్యాప్తంగా 225 మిలియన్ల మొబైల్‌ ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీరందరిలో ఇప్పుడు ఆందోళన నెలకొంది.

గడ్డు కాలమే
చైనా నుంచి దిగుమతుల్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, విడి పరికరాలే సింహభాగం ఉండటం గమనార్హం. మన దేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు అవసరమైన విడి భాగాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఇవి నిలిచిపోవడంతో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ, వ్యాపారరంగం విలవిలలాడుతోంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే గడ్డు పరిస్థితి తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

సందిగ్ధంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌
ఇ–కామర్స్‌ వ్యాపారంలో మన దేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏటా 14.80 బిలియన్‌ డాలర్ల విలువైన ఇ–కామర్స్‌ వ్యాపారం స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై ఆధారపడి జరుగుతోంది. ఇందులో స్మార్ట్‌ ఫోన్ల వ్యాపారం 10.71 బిలియన్‌ డాలర్లు ఉంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలన్నీ చైనాలోనే ఫ్యాక్టరీలు, అసెంబ్లింగ్‌ యూనిట్లు నెలకొల్పాయి. అక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో ఇ–కామర్స్‌ వ్యాపారం బాగా దెబ్బతింది. దేశంలోని రెండు పెద్ద ఇ–కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వారం రోజులుగా బుకింగ్‌లపై సందిగ్ధంలో పడ్డాయి. ఆర్డర్ల డెలివరీని వాయిదా వేస్తున్నాయి. దేశంలో 85 శాతం ఇ–కామర్స్‌ వ్యాపారం ఈ రెండు సంస్థల ఆధీనంలోనే ఉండటం గమనార్హం.

కొత్త మోడళ్లు వాయిదా...
యాపిల్‌ ఫోన్‌తోపాటు ఇతర ప్రముఖ బ్రాండ్లలో అత్యధిక శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. తాజాగా యాపిల్‌ ఫోన్ల సరఫరా నిలిచిపోయింది. షియామీ కంపెనీ తమ ఉత్పత్తుల దిగుమతి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ ఫోన్ల నిల్వలు మరో పదిరోజుల వరకే సరిపోతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఫోన్ల లాంచింగ్‌ను కంపెనీలు వాయిదా వేసే యోచనలో ఉన్నాయి.

చివరి త్రైమాసికంలో శరాఘాతం
కోవిడ్‌ వైరస్‌ తీవ్రతకు ఈ త్రైమాసికంలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల మార్కెట్‌ కోలుకోవడం కష్టమేనని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే మార్చిలో విక్రయాలు బాగా దెబ్బతింటాయి. గత ఏడాదితో పోలిస్తే స్మార్ట్‌ ఫోన్ల విక్రయాలు 15 శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నెలాఖరు తరువాత కష్టాలే!
‘ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి కొనసాగిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు ఫర్వాలేదు. అప్పటికి కూడా చైనా నుంచి దిగుమతులు పునఃప్రారంభం కాకుంటే ఉత్పత్తి నిలిపివేసి కొందరు కార్మికులకు తాత్కాలిక సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో’ అని ఓ మొబైల్‌ తయారీ కంపెనీ ప్రతినిధి ‘సాక్షి’తో పేర్కొన్నారు.

88 శాతం విడిభాగాలు చైనా నుంచే
దేశంలో ఏటా 225 మిలియన్ల మొబైల్‌ ఫోన్లు తయారవుతుండగా రాష్ట్రంలోని శ్రీసిటీ సెజ్‌లో దాదాపు 50 మిలియన్ల ఫోన్లు ఉత్పత్తవుతున్నాయి. వీటి తయారీకి అవసరమైన విడి భాగాల్లో 12 శాతం మాత్రమే దేశీయంగా లభిస్తుండగా 88 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. తాజాగా దిగుమతులు నిలిచిపోవడంతో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఉన్న విడి భాగాలతో గరిష్టంగా ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉత్పత్తి కొనసాగించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement