జూన్ నాటికి ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్: సీఎం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గృహాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆయన శంకుస్థాపన, ప్రారంభో త్సవాలు చేశారు. అనంతరం ఏలూరులో నీరు–ప్రగతిపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ప్రసంగించారు.టీడీపీ అధికారంలోకి వచ్చి జూన్ 8 నాటికి మూ డేళ్లు పూర్తవుతున్న దృష్ట్యా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యాన్ని పూర్తిచేయ నున్నట్టు చెప్పారు.
తెల్లరేషన్ కార్డు దారులకు రేషన్ బియ్యం ఇస్తున్నామని, భవిష్యత్‌లో వారు బియ్యం వద్దనుకుంటే.. డబ్బు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాగా లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని పలువురు సీఎందృష్టికి తీసుకెళ్లారు. నల్లజర్ల మండలం పోతవరం సభలో బాబుకు ఈ పరిస్థితి ఎదురైంది. స్థానికురాలు అబ్బూరి లక్ష్మి తనకు పాస్‌బుక్ మంజూరు చేసి, ఆ పొలాన్ని తన భర్త పేరుపై మార్చేందుకు రెవెన్యూ అధికారులు రూ.30 వేలు లంచం అడుగుతున్నారని వాపోయారు. దీంతో సీఎం ఆ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, గ్రామ వీఆర్‌వోపై 24 గంటల్లో విచారణ చేయాలని ఆదేశించారు. మరో వృద్ధురాలు శ్యామల తనకు మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.