ఖమ్మం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ సోమవారం జిల్లాలోని మూడు సెంటర్లలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, భద్రాచలంలోని ఎటపాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి విడత ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. 1నుంచి 15 వేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మూడు సెంటర్లలో కలిపి 321 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మెలు, ఆందోళనల నేపథ్యంలో పలువురు ఉద్యోగులు కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. పలు చోట్ల విద్యార్థి సంఘాలు కూడా కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నాయి. ఇది గమనించిన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు మన జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పక్క జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగే అవకాశం ఉందని కౌన్సెలింగ్ అధికారులు చెపుతున్నారు. మంగళవారం జరిగే కౌన్సెలింగ్‌లో 15, 001వ ర్యాంకు నుంచి 30 వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని వారు సూచించారు.
ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో సోమవారం జరిగిన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 250 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ జిల్లా కో ఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే పలువురు విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. కౌన్సెలింగ్ సజావుగా నిర్వహించడంతోపాటు, విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కొత్తగూడెం మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ, సత్తుపల్లి, మధిర ప్రాంతాల నుంచి సుమారు 54 మంది హాజరైనట్లు ఎంసెట్ అసిస్టెంట్ క్యాంప్ అధికారి ఎన్.వి.ఆర్.కె.శర్మ తెలిపారు. ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఇక్కడ 10.30 గంటల వరకు ప్రారంభం కాలేదు.
భద్రాచలం పట్టణ సమీపంలోని ఎటపాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సారిగా ఎంసెట్ కౌన్సెల్సింగ్ నిర్వహించారు. తొలిరోజున 1 నుంచి 15 వేల లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. తొలిరోజున 17 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ గుణశేఖరన్ తెలిపారు. రెండవ రోజున 15,001 ర్యాంకు నుంచి 30 వేల లోపు ర్యాంకర్ల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు చెప్పారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతం
Published Tue, Aug 20 2013 6:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement