ఖమ్మం: లేడీ టీచర్‌ వికృత చేష్టలు.. విద్యార్థుల జుట్టు కత్తిరించి... | Teacher Who Cut The Hair Of Students In Khammam District | Sakshi
Sakshi News home page

ఖమ్మం: లేడీ టీచర్‌ వికృత చేష్టలు.. విద్యార్థుల జుట్టు కత్తిరించి...

Published Sat, Jul 27 2024 3:50 PM | Last Updated on Sat, Jul 27 2024 4:35 PM

Teacher Who Cut The Hair Of Students In Khammam District

సాక్షి, ఖమ్మం జిల్లా: జుట్టు పెంచుకొని స్కూల్‌కి వస్తున్నారంటూ ఓ టీచర్ కత్తెర పట్టుకుని స్వయంగా తానే విద్యార్థులకు పేనుకొరుకుడు మాదిరిగా కటింగ్ చేసి వికృత చేష్టలకు పాల్పడింది. ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల హెయిర్ స్టైల్ చూసి అవాక్కైన తల్లిదండ్రులు స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకుని స్కూల్‌కి రావాలని హెచ్చరించిన మాట వినడం లేదని స్వయంగా ఉపాధ్యాయురాలు శిరీషనే బార్బర్ అవతారమెత్తింది.

ఓ కత్తెర తీసుకొని తనకి వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరికినట్టుగా మారింది. అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయం తెలపగా పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని,అవమానభారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement