సులభ బోధన.. ఆమె సొంతం! | Telangana: Women Teacher Easy Teaching To Students Nalgonda | Sakshi
Sakshi News home page

సులభ బోధన.. ఆమె సొంతం!

Published Wed, Mar 2 2022 7:32 PM | Last Updated on Thu, Mar 3 2022 9:23 AM

Telangana: Women Teacher Easy Teaching To Students Nalgonda - Sakshi

గరిడేపల్లి : విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగి.. సమాజానికి ఉపయోగపడాలన్నదే తన లక్ష్యమని గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు, స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ మెంబర్‌ మారం పవిత్ర అంటున్నారు. పవిత్ర సారాబాయి టీచర్‌ సైంటిస్ట్‌ నేషనల్‌ అవార్డులు – 2021కి ఎంపియ్యారు. ఢిల్లీకి చెందిన విజ్ఞాన్‌ ప్రాసర్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ సైన్స్‌ క్లబ్‌ (విప్‌నెట్‌) ఆర్గనైజేషన్‌ 2020లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ సైంటిస్ట్‌ ఇండియా పోటీల్లో అప్పర్‌ ప్రైమరీ కేటగిరి విభాగంలో వేలాదిమంది సైన్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాత పరీక్ష ద్వారా 87 మందిని ఎంపిక చేశారు. మూడు దశల్లో జరిగిన ఇంటర్వ్యూలో పవిత్ర జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. సైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 28న గుజరాత్‌ నుంచి జరిగిన ఆన్‌లైన్‌ కార్యక్రమం ద్వారా జమ్మూకశ్మీర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారి డాక్టర్‌ రవిశంకర్‌ చేతుల మీదుగా ఈ అవార్డు పొందారు. 

క్షేత్ర పర్యటనల ద్వారా బోధన
ఉపాధ్యాయురాలు పవిత్ర విద్యార్థులకు సులభతరమైన రీతిలో బోధించడానికి వివిధ రకాల ప్రయోగాలు, కృత్యాలు చేయిస్తారు. విద్యార్థులను క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లి ప్రత్యక్ష అనుభవాల ద్వారా విద్యనందిస్తున్నారు. సులభతరమైన విద్యనందిస్తూ, ప్రత్యక్షంగా యూట్యూబ్, డీడీ యాదగిరి, ఎస్‌ఆర్‌టీ, వీటీఎల్‌ఎం, ఐసీటీ టూల్స్‌ వంటి వాటి ద్వారా తన సేవలను అందిస్తున్నారు. విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి, నూతన ఆలోచనలు కలిగించడానికి వివిధ రకాల సైన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.

ప్రభుత్వ బడుల్లోనే విద్యాభ్యాసం
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో మారం శంకర్‌రెడ్డి, కలమ్మ దంపతుల కమార్తె పవిత్ర. పదో తరగతి వరకు వేములపల్లి, తడకమళ్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ మిర్యాలగూడలోని ప్రైవేట్‌ కళాశాలల్లో, ఎంఎస్‌ఆర్‌ బీఈడీ సూర్యాపేటలో చదివారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలోనే చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాతాల మన్మథరెడ్డితో పవిత్ర వివాహం జరిగింది. భర్త మన్మథరెడ్డి ప్రోత్సాహంతో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసింది. 2008 డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. 2009లో ఆత్మకూర్‌.ఎస్‌ మండలంలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరింది. 2012 – 2015 వరకు నూతనకల్‌ మండలంలో గోరెంట్లలో పని చేశారు. 2015 నుంచి గడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో బోధిస్తున్నారు.

ఆమె పర్యవేక్షణలో విద్యార్థుల ప్రతిభ
►    పవిత్ర అందించిన ప్రోత్సాహం, విద్య, క్షేత్ర అనుభవాలలో విద్యార్థులకు కూడా పలు అవార్డులు సాధించారు.
►   2017లో మోక్షజ్ఞ ‘ప్లోటింగ్‌ గార్బెజ్‌ కలెక్టర్‌’, భవాని ‘న్యూటిన్ట్‌రిచ్‌ పోట్స్‌’ జిల్లాస్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. 
►   2018లో సాయి దీపక్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ కార్యక్రమాలకు ఎంపికయ్యాడు. 
►   ఇన్‌స్పైర్‌ అవార్డు కేటగిరిలో 2018లో స్వాతి ఢిల్లీ ఐఐటీలో పాల్గొంది. 
►    2019లో 20 మంది విద్యార్థులు 10 ప్రాజెక్టులను జిల్లా ఎన్‌సీఎస్‌సీలో ప్రదర్శించారు. 
►    2019లో నవీన్, మోక్షజ్ఞ ఎగ్జిబిట్‌ రాష్ట్రస్థాయిలో ప్రదర్శించారు. 
►    2013–14 సంవత్సరంలో నేషనల్‌ చిల్ట్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కి మహేష్, ఇతర విద్యార్థులు ఎనర్జీ రిసోర్సెస్‌ యూజ్‌డ్‌ బై ఉమెన్‌ ఫర్‌ కు కింగ్‌ ఇన్‌ గోరెంట్ల అండ్‌ ఇట్స్‌ ఇంపాక్ట్‌ ఆన్‌ దెయిర్‌ హెల్త్‌ అనే అంశంపై ప్రాజెక్టు సమర్పించారు.
►    2019–20లో జవహర్‌లాల్‌ నెహ్రూ సైన్స్‌ఫెయిర్‌ రాష్ట్రస్థాయిలో జి.వెంకటేశ్‌ ఎంపిక.
►    2019లో ఐదు ప్రాజెక్టులు, 2020లో 3, 2018లో 1, 2017లో జరిగిన సైన్స్‌ఫేర్‌లో విద్యార్థుల ప్రదర్శన.
►   2020–21లో సీహెచ్‌.రాము రాస్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో పాల్గొన్నారు.

సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా..
u    జాతీయ స్థాయిలో సీఐఈటీ, ఎన్‌ఐసీఆర్‌టీ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా 2020–21లో ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఐసీటీ టూల్స్‌పైన అవగాహన తరగతులు అందించారు.
u    2019లో గాంధీజీ విద్యా విధానంపైన జాతీయ స్థాయి సెమినార్‌లో సైన్స్‌ టీచింగ్‌ త్రో హ్యాండ్స్‌ ఆన్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అవే అంశంపై ప్రసంగించారు. 
u    2017 నుంచి ఇప్పటి వరకు స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎస్‌ఐఈటీ) ద్వారా జీవశాస్త్రంలో 14 డిజిటల్‌ పాఠాలను బోధించారు.
u    తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో 6, 7 సామాన్యశాస్త్రం 8, 9, 10 జీవశాస్త్రం పాఠ్యపుస్తకాలలో ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌లలో కంటెంట్‌ తయారీకి ఎస్‌సీఈఆర్‌టీ దీక్ష ఆధ్వర్యంలో 60 వీడియోలు, 16 క్వశ్చన్‌ సెట్‌లను తయారు చేశారు. వాటిని ఎస్‌సీఆర్‌టీ క్యూ ఆర్‌ కోడ్‌లో పబ్లిష్‌ చేసింది. 
u    ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు వర్క్‌షీట్‌ల తయారీ, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై ఒత్తిడి తగ్గించడానికి ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన జీవశాస్త్ర అభ్యస దీపికల్లో పాల్గొన్నారు.
u     జీవశాస్త్ర శిక్షణ అభ్యసన ఫలితాలకు సంబంధిన 2016, 2019, 2020, 2021 సంవత్సరాల్లో రాష్ట్రస్థాయిలో సెమినార్‌లలో పాల్గొన్నారు.
u    కోవిడ్‌ సమయంలో యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా 50 వీడియోలు రూపొందించి వాట్సప్‌ ద్వారా విద్యార్థులకు అందించారు. 
u    తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పదో తరగతి విద్యార్థుల కోసం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హోంసైన్స్‌ పాఠాలు బోధించారు.

అందుకున్న అవార్డులు
u    2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు.
u    2019లో అక్షర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ టీచర్‌ అవార్డు.
u    2018లో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిసే అవకాశం ఆమెతో పాటు ఆరుగురు విద్యార్థులకు వచ్చింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెళ్లలేక పోయారు.
u    టెక్‌ మహీంద్రా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్‌ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్స్‌ఫార్మింగ్‌ అవార్డు.
u    2021లో సారాబాయి టీచర్‌ సైంటిస్ట్‌ నేషనల్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతా
నేను పేద కుటుంబం నుంచి వచ్చా. తల్లిదండ్రులు కష్టాన్ని కళ్లారా చూశా. నా భర్త ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించా. నాకు చదువు నేర్పిన మాస్టార్లు ఇచ్చిన స్ఫూర్తితో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు సాధించా. నేను చదువు నేర్పే పిల్లలను ప్రపంచ, జాతీయ స్థాయిలో నిలపడమే నా లక్ష్యం. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఎన్నో రకాల కార్యక్రమాలను రూపొందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతా. 
– మారం పవిత్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement