అన్ని కేంద్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ | EAMCET Counselling started in all centers | Sakshi
Sakshi News home page

అన్ని కేంద్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్

Published Thu, Aug 29 2013 2:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జిల్లాలో వాయిదా పడిన ఎంసెట్ కౌన్సెలింగ్‌ను బుధవారం పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు.

కాకినాడ రూరల్/భానుగుడి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జిల్లాలో వాయిదా పడిన ఎంసెట్ కౌన్సెలింగ్‌ను బుధవారం పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో, మోహన్ కాన్వెంట్‌లో, బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం నుంచి, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్నం నుంచి ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ర్యాంకుల సీరిస్ 1,60,000 నుండి 1,80,000 ర్యాంకుల సీరిస్‌కు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా, అధికారులు మాత్రం విద్యార్థుల సౌకర్యార్థం లక్షా ఎనభైవేల లోపు ర్యాంకులు గల విద్యార్ధుంలందరికీ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. కాకినాడ ఏపీటీలో నిర్వహిం చిన కౌన్సెలింగ్‌లో 95 మంది తమ సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకొన్నారు. 
 
 మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రం 35మంది మాత్రమే పరిశీలన చేయించుకొన్నారు. పోలీసు రక్షణలో కౌన్సెలింగ్ జరుగుతున్న మోహన్ కాన్వెంట్‌లో 600 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. ఇదిలాఉండగా వెబ్ ఆప్షన్ల ఎంపికకు ప్రభుత్వం ఎటువంటి తేదీలను ఖరారు చేయకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వీవీ సుబ్బారావును వివరణ కోరగా వెబ్‌ఆప్షన్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలో తేదీలను ప్రకటిస్తుందని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వచ్చే నెల 2నుంచి వెబ్‌ఆప్షన్లు ప్రారంభం కావచ్చన్నారు.
 
 బొమ్మూరు పాలిటెక్నిక్‌లో...
 రాజమండ్రిరూరల్: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు విధులకు హాజరుకావడంతో బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కళాశాల లెక్చరర్లు విధులను బహిష్కరించడంతో ఈనెల 19వ తేదీన ఎంసెట్ కౌన్సెలింగ్ మొదటిరోజున కాంట్రాక్టు లెక్చరర్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. కాంట్రాక్టు లెక్చరర్లతో కౌన్సెలింగ్ నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంసెట్ కన్వీనర్ ఆదేశించడంతో ఈనెల 20వతేదీ నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. 
 
 పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడంతో బుధవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 63 మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు. గురువారం ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు గల విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావచ్చని కళాశాల ప్రిన్సిపాల్ ఎ. విలియం క్యారీ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దక్షిణమండలం డీఎస్పీ శ్రీదేవీరావు, ధవళేశ్వరం ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌కుమార్, పోలీసుసిబ్బంది పర్యవేక్షించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement