తూర్పు నౌకాదళంలోకి కమోర్తా
- రేపు ప్రారంభించనున్న రక్షణ మంత్రి
విశాఖపట్నం: జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తా తూర్పు నౌకాదళం అమ్ములపొదిలోకి చేరనుంది. శనివారం ఈ నౌకను రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేవల్ డాక్‌యార్డులో ప్రారంభించనున్నారు. కొల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌యార్డ్‌లో దీనిని నిర్మించారు. ఇలాంటివి నాలుగు నిర్మించాలని నిర్ణయించగా అందులో తొలి నౌక కమోర్తా. ఈ యుద్ధనౌకల ప్రాజెక్ట్ డిజైను పూర్తికి నాలుగేళ్లు పట్టింది. గతేడాది జూన్‌లో కమోర్తా సీ ట్రయిల్స్ పూర్తిచేసుకుంది. భారత నావికా దళానికి నిర్మాణ సంస్ధ ఈఏడాది జూలై12నఅప్పగించారు. ఉన్నతశ్రేణికి చెందిన స్టీల్‌తో నౌక నిర్మితమైంది.
ఇదీ స్వరూపం
13 మీటర్ల భీమ్‌ను కలిగి ఉండే కమోర్త నౌక 110 మీటర్ల పొడవుంటుంది. 25 నాటికన్ మైళ్ళ వేగంతో దూసుకుపోగలదు. 3500 నాటికన్ మైళ్ళ పాటు నిరంతర పయనం సాగించగలదు. పూర్తి ఆయుధ సామగ్రిని కలిగి సెన్సార్‌ల పరిజ్ఞానంతో అత్యంత ఆధునికత సంతరించుకుంది.
భారీ టోర్పడేలు,ఎఎస్‌డబ్ల్యు రాకెట్స్,మధ్యంతర స్థాయి గన్,మరోరెండు మల్టీ బారన్ గన్‌లు ఈయుద్ధ నౌక సాధనసంపత్తి. 200 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సయితం గుర్తించగలదు. ఎఎస్‌డబ్ల్యు హెలికాఫ్టర్‌ను సయితం తీసుకుపోగలదు. 13 మంది అధికారులు173మంది నావికులతో కమోడార్ మనోజ్ ఝా నేతత్వంలో సేవలందించనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్‌కే ఈ యుద్ధ నౌక చేరి ప్రత్యేకతను చాటుకోనుంది.