ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నంద్యాలకు భారీగా డబ్బులు వస్తున్నాయని సమాచారం అందడంతో గాజులపల్లి వద్ద ఓ కంటెయినర్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు.
- నగదు వస్తోందని ఈసీకి ఫిర్యాదులు
- తనిఖీ చేసిన పోలీసులు, అధికారులు
- డబ్బులు లేవని తేల్చిన అధికారులు
- మరో బస్సు, రెండు ఇన్నోవాలను వదిలేశారని విమర్శలు
- ఫిర్యాదు చేసిన వారిపైనే కేసు నమోదు చేస్తామంటున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నంద్యాలకు భారీగా డబ్బులు వస్తున్నాయని సమాచారం అందడంతో గాజులపల్లి వద్ద ఓ కంటెయినర్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌వో) కార్యాలయం వద్దకు తీసుకెళ్లి...అక్కడ తాళాన్ని పగలగొట్టి కంటెయినర్‌ను తెరిచారు. అందులో కూరగాయలు, వంటసామగ్రి ఉందని గుర్తించారు. పంచనామా రాసి మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అది సీఎం ప్యాంట్రీ వాహనమని అందులోని వారు చెబుతున్నారు. కానీ దానిపై పోలీసు వాహనం అని రాసి ఉంది. వాస్తవానికి ఈ వాహనం ఏపీఎస్‌ఆర్టీసీది కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తామని అధికారులు అంటున్నారు.

ఆ రెండు వాహనాలు ఏమయ్యాయి?
వాటిని అక్కడికక్కడే తనిఖీ చేయాలని అక్కడ గుమిగూడిన స్థానికులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కానీ పోలీసులు, అధికారులు దానికి అంగీకరించలేదు. పైగా స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు నానా హైరానా పడ్డారు. వాహనాలను ఆర్డీవో ఆఫీసుకు తరలిస్తామని చెప్పారు. అప్పటికే మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని, ఇన్నోవాను ముందుకు కదలించారు. ప్రజల మధ్య మాత్రం ప్యాంట్రీ కంటెయినర్ వాహనం అలాగే ఉంచారు. ఆ తర్వాత దాన్ని ఆర్డీవో ఆఫీసుకు తరలించి తనిఖీ చేసి, ఏమీ లేవని తేల్చారు. కంటెయినర్‌తో వచ్చిన ఇన్నోవా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు మాత్రం అప్పటికే కన్పించకుండా పోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఈ మూడు వాహనాలు విజయవాడలోని సీఎం నివాసం నుంచే బయల్దేరాయా? కేవలం కంటెయినర్‌ను మాత్రమే పట్టుకుని ప్రజలను పక్కదారి పట్టించారా? మిగిలిన రెండు వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తరలించారా? అనేది ప్రతిపక్ష పార్టీల అనుమానం. ఈ కోణంలో దర్యాప్తు చేయాలనేది వారి డిమాండ్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలో ఓటమి భయం పెరిగిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అందుకే అధికార పార్టీ గెలుపుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తన పర్యటనలో బాహాటంగా నగదు కట్టలు పంపిణీ చేసిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. సర్వేల పేరుతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు.
ఇలాంటి నేపథ్యంలో డబ్బు పంపిణీకి టీడీపీ చేస్తున్న సన్నాహాలను వైఎస్సార్ కాంగ్రెస్ ముందే పసిగట్టింది. దీనిపై నిఘా పెంచాలని రెండు రోజులుగా డిమాండ్ చేస్తోంది. ఈ కోణంలోనే ఎన్నికల సంఘం నిఘా పెంచింది. సీఎం కార్యాలయం నుంచి బయల్దేరిన వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారనే సమాచారం ఈ విధంగానే ఎన్నికల కమిషన్‌కు వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పారదర్శకంగా అన్ని వాహనాలను తనిఖీ చేసి ఉంటే, వాస్తవం వెలుగులోకి వచ్చేది. కానీ రెండు వాహనాలను గుట్టుచప్పుడు కాకుండా పంపించి, నాటకీయంగా సీఎం వంటవాహనాన్ని తనిఖీ చేసి, ఏమీ లేదని తేల్చిందనేది విపక్షాల ఆరోపణ. మూడు వాహనాలు ఒకే శ్రేణిలో నంద్యాలకు వస్తున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది.
అలాంటప్పుడు అక్కడికక్కడే తనిఖీ చేసి ఉంటే అసలు కథ బయటకు వచ్చేదేమో అని ప్రజలు అనుకుంటున్నారు. నిష్పక్షపాతంగా ఉంటే, ఈ విధంగానే తనిఖీ చేసి ఉండేవాళ్ళు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అప్పుడు పోలీసులు ఆమె వాహనాన్నే కాదు, దుస్తులు ఉన్న సూట్‌కేసును కూడా నడిరోడ్డుపై తనిఖీ చేసిన దాఖలాలున్నాయి. తాజా ఘటనలో మాత్రం పట్టుబడిన చోటే వాహనాలను తనిఖీ చేయకపోవడం, రెండు వాహనాలను గుట్టుచప్పుడు కాకుండా పంపించేయడం వెనుక రహస్యం ఏమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ముగాయడం వల్లే అధికారులు ఈ విధంగా చేశారా? అనే సందేహాలు సర్వత్రా విన్పిస్తున్నాయి.