ప్రలోభాలు.. బెదిరింపులు
సీఎం చంద్రబాబు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పర్యటన ఆసాంతం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని తలపించింది.
- ఎన్నికల ప్రచారాన్ని తలపించిన సీఎం నంద్యాల పర్యటన
- కాదు..కాదంటూనే ‘అధికారిక ప్రచారం’
- ‘అభివృద్ధి’ పేరిట ఆకట్టుకునేందుకు అవస్థలు
- వైఎస్సార్‌సీపీ సర్పంచులను బెదిరించే యత్నం
- ఎస్‌ఆర్‌బీసీ కాలనీవాసుల నుంచి నిరసన సెగ
సాక్షి ప్రతినిధి, కర్నూలు : సీఎం చంద్రబాబు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పర్యటన ఆసాంతం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని తలపించింది. పదే పదే మతాలు, కులాల ప్రస్తావన తెస్తూ ఆయన పర్యటన, ప్రసంగం సాగాయి. శనివారం ఉదయం ప్రారంభమైన పర్యటన నంద్యాల పట్టణంతో పాటు నంద్యాల మండలం, గోస్పాడు మండలాల్లోని పలు గ్రామాల్లో రాత్రి వరకూ కొనసాగింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కేవలం నెల రోజుల్లోనే రెండుసార్లు పర్యటించిన ఆయన.. ఈసారి అభివృద్ధి పేరిట ప్రజలను ఆకట్టుకునేందుకు అవస్థలు పడ్డారు. అంతేకాకుండా అభివృద్ధికి అడ్డుపడే సర్పంచులను గ్రామసభ ద్వారా తొలగిస్తామంటూ పరోక్షంగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచులను బెదిరించే ప్రయత్నం చేశారు.
ఎస్‌పీజీ గ్రౌండులో ఏర్పాటు చేసిన సభలో కుట్టుమిషన్లు, ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం చామ కాలువ అభివృద్ధి పనులతోపాటు ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రోడ్ల విస్తరణ పనులను బస్సు ద్వారానే పర్యవేక్షించారు. ఫరూఖ్ మద్దతుదారులు రాజ్ థియేటర్ వద్ద సీఎం కోసం పడిగాపులు కాసినా.. వారిని కనీసం పలకరించకుండానే ముందుకు సాగిపోయారు. దీంతో వారు నిరాశకు లోనయ్యారు. అనంతరం గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులను తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు.
విభేదాలు యథాతథం
సీఎం పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి కేవలం భూమా నాగిరెడ్డి, సీఎం ఫొటోలతో పాటు తన ఫొటోలను మాత్రమే ఉంచి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంత్రి అఖిల ప్రియ ఫొటోలు ఎక్కడా కనిపించలేదు. సభలో కూడా మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఎడమొహం.. పెడమొహంగానే ఉన్నారు. ఇక సీఎం ప్రసంగం గంటా 15 నిమిషాలు సాగడంతో ఓపిక నశించిన అనేక మంది సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సీఎం ప్రసంగం సాగుతున్న సమయంలోనే కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. తమ గోడు వినాలంటూ నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ కాలనీ వాసులు నిరసనకు దిగారు. అయినా చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడంతో ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఇక కౌన్సిలర్లతో శనివారం రాత్రి జరగాల్సిన సమావేశం కాస్తా ఆదివారం ఉదయానికి వాయిదా పడింది. సీఎం పర్యటన సాగుతున్నంత సేపూ నంద్యాల పట్ణణం అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.