సెంచరీ కొట్టే వయస్సు మాది..
బలివాడ ఆదిలక్ష్మి..ఈ మధ్యనే నూరేళ్ల జన్మదిన వేడుకను జరుపుకుంది. మనమలు..మునిమనమల మధ్య వందేళ్ల బర్త్‌డే కేకునూ కూడా కోసింది. ఆనందోత్సాహాల మధ్య శతవసంతాల పండుగను చేసుకుంది. ఇలాంటి వేడుక ఎంతమందికి సాధ్యమవుతుంది..వందేళ్లు ఆరోగ్యంగా బతికేవారు ఎంతమంది ఉన్నారు..నిజమేమరి..వృద్ధాప్యం భారమైన రోజుల్లో తమ పని తాము చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించడమంటే వరమే. ఇలాంటి వారిని చూస్తే వయోభారమనే పదాన్నే నిఘంటువు నుంచి తొలగించాలనిపిస్తుంది. ఒక్క ఆదిలక్ష్మేనా..మరికొందరూ ఉన్నారు..సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ వందేళ్ల పండగలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారిని ఒకసారి పలకరిద్దామా..వారి ఆరోగ్య రహస్యమేమిటో తెలుసుకుందామా..
కోడి కూయక ముందే నిద్ర లేచేవారు..పొద్దు కుంకిన వెంటనే నిద్రపోయేవారు. (ఎర్లీ టు బెడ్ ఎర్లీటు రైజ్ మేక్స్ ఎ మన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్) పనిని ఆస్వాదిస్తూ కాయకష్టం చేసేవారు. శారీరక శ్రమతో పాటు చక్కటి ఆహారం,
అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఇదీ ఆనాటి వారి జీవనం. అందుకే వందకు చేరువవుతున్నా, సెంచరీ చేసినా భువిపై నాటౌట్‌గా నిలిచారు. నేడు దానికి విరుద్ధంగా జీవనం కొనసాగుతోంది. అందుకే అరవై ఏళ్లకే ఆయుష్షు తీరుతోంది. వందేళ్లకు చేరువయ్యే, దాటిన అవ్వా తాతలను పలకరించగా... వారి ఆరోగ్య రహస్యం, జీవన విధానాలు ‘సాక్షి’తో పంచుకున్నారు.
వేళకు ఆహారం...సమయానికి నిద్ర
అరకులోయ: వేళకు ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర పోవడంతోనే వందేళ్లు బతికి ఉన్నాను. నాకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె, వారందరికీ పెళ్లిళ్లు చేశాను. చిన్నతనం నుంచి ఉదయం పూట అంబలి తాగేవాళ్లము. మాంసం కన్నా కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాను. పొగ, మద్యం వంటి చెడు అలవాట్లులేవు. సుమారు 30 ఏళ్లుగా వృధాప్య ఫించన్ తీసుకుంటున్నాను.
-సరోజిని సాహు,
ఎస్‌బీఐ కాలనీ, అరకు
వేళకు దినచర్య సాగాలి
గోపాలపట్నం: వేళకు దినచర్య సాగాలి. వేళకు భోంచేయాలి. నిద్రపోవాలి. సదుపాయాలు ఉన్నాయని సుఖపడితే ఆరోగ్యం ఎలా బాగుంటుంది. జీవితం సాధారణంగానే సాగాలి. అతిసుఖం మంచిదికాదు. మనం బాగున్నామన్న సంతృప్తితో ముందుకెళ్లాలి. ఇతరుల కోసం అనవసర ఆలోచనలు కూడదు. అన్నిటికీ ఇతరులపై ఆధారపడటం వల్ల బద్ధకం పెరిగి ఆత్మస్థైర్యం కోల్పోతాం. నాకు 101 ఏళ్లు. భర్త 60 ఏళ్ల వయసులో మృతిచెందారు. వేకువజామున నాలుగున్నర గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుంటాను. టీ తాగుతాను. కొడుకు కోడలు వద్దన్నా ఇంటి పనుల్లో కలియజేసుకుంటాను. ఇల్లు, వాకిలి తుడుస్తాను. నీళ్లు పడతాను. వంట చేస్తాను. ఉదయం 11 గంటలకల్లా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను. మూడు గంటలకు టీ, స్నాక్స్ తీసుకుంటాను. సూర్యాస్తమయం కల్లా భోంచేస్తాను. రాత్రి 7 గంటల కల్లా నిద్రపోతాను. ఇప్పటికీ రోగమంటే ఏంటో తెలీదు. బీపీ, షుగర్‌లు రాలేదు. దృష్టి లోపం లేదు. తీరిక సమయంలో బియ్యం గింజల్లో రాళ్లేరుతుంటాను.
-బలివాడ ఆదిలక్ష్మి, శ్రీరామనగర్
ఆరోగ్య సమస్యలు లేవు
నక్కపల్లి/ఎస్‌రాయవరం : నాకు 104 సంవత్సరాలు. ఇప్పటికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో నిత్యం 20 కిలోమీటర్లు నడిచేవాణ్ని. గంటి, వరి, చోడి అన్నం తినేవాణ్ని.ఇప్పటికీ పేపరు చదువుతుంటాను.తెల్లదొరల స్థావరాలను చూశాను. వారిని ఎదిరించిన అల్లూరి సీతారామరాజును పాయకరావుపేట మండలం సీతమ్మవారిమెట్టపై చూశాను. ఆయన చేసే తపస్సు,ధ్యాన కార్యక్రమాలను దగ్గర నుంచి చూశాను. మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో భాగంగా ఉప్పలం, రేవుపోలవరం, పెనుగొల్లు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వారితోపాటు కొంతదూరం యాత్రలో పాల్గొన్నాను. 1942లో రాజ రాజేశ్వరితో వివాహం అయింది. ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమంటే ఇష్టం. దాదాపు 80 ఏళ్ల కిందట మట్టి, సున్నంతోకట్టిన పెంకుటింట్లోనే నివశిస్తున్నాను.
-పత్సబట్ల అప్పలకొండరాజు, గుడివాడ
ఆధారం లేదు..అయితేనేం..
పాడేరు: నాకు 98 ఏళ్లు. నాకు 3 ఏళ్ల వయసులో8 ఏళ్ల వయసు ఉన్న కామేశ్వరరావు అనే దగ్గరి బంధువుతో బాల్య వివాహం జరిపించారు. తండ్రి ఒడిలోనే వివాహం జరిగింది. నాకు ఐదేళ్ల వయసు వచ్చే సరికి భర్త కామేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందాడు. బ్రాహ్మణ ఆచారం ప్రకారం చిన్న తనం నుంచి ఇంటి బయటకు రావడం మానేశాను. తల్లిదండ్రులు కూడా కొంతకాలానికి కాలం చెందారు. 1965లో పాతపాడేరులో ఉన్న సోదరుడు గంటి జగన్నాథస్వామికి ఇంటికి వచ్చి జీవనం సాగించాను. సోదరుడు మృతి చెందడంతో ప్రస్తుతం మేనల్లుడు గంటి గోపాలరావు ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాను. బంధువులు, మేనల్లుడు కుటుంబం కొంత చేదోడు వాదోడుగా ఉంటుండటంతో వారు కల్పించే సహాయ సహకారాలతో ఒంటరిగానే జీవిస్తున్నాను.ఎవరిమీదా ఆధారపడకుండా పనులు చేసుకుంటాను. పూర్వం నుంచి ఒంటిపూట భోజనమే చేస్తున్నాను. రాత్రి వేళ ఆకలి అన్పిస్తే బియ్యం నూకతో ఉప్మా చేసుకుంటాను. 20 ఏళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నాను. పైసా ఆదాయం లేదు. పాలకులు దయ ఉంచి పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. -తాతా కామేశ్వరమ్మ, పాత పాడేరు
వందేళ్ల ‘వరం’
తగరపువలస : 1913లో జన్మించాను. అయిదో తరగతి వరకూ చదువుకున్నాను. భీమిలిలోని కుమార్తె శిల్ల సావిత్రమ్మ (75), మనవడు, మనవరాళ్లు, మునిమనమలతో కలిసి ఉంటున్నాను.1972 నుంచి నలభై ఏళ్లుగా కీటిన్‌పేటలో రేషన్ డిపో నిర్వహిస్తున్నాను. అప్పట్లో 8 బస్తాలతో ప్రారంభమైన రేషన్ దుకాణం ఇప్పుడు 150 బస్తాలకు చేరుకుంది. అప్పట్లో దమ్మిడి ఇప్పటి రూపాయితో సమానం. భర్త సూర్యనారాయణ 70 ఏళ్ల కిందట మృతిచెందాడు. ఉదయం మూడు ఇడ్లీ, మధ్యాహ్నం కాయగూరలతో అన్నం, సాయంత్రం చపాతి, తీసుకుంటాను. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ దుకాణానికి నడిచివెళ్లి వస్తుంటాను. అది కూడా ఆరోగ్య రహస్యానికి కారణం కావచ్చు. గొప్పులు తవ్వడం తదితర వ్యవసాయ పనుల్లో కూడా పాలుపంచుకుంటాను.స్వాతంత్య్రోద్యమ కాలంలో భీమిలి విచ్చేసిన మహాత్ముడిని చూశాను. - నీలాపు వరహాలమ్మ(102), భీమిలి
మా పనులు మేమే చేసుకుంటాం
అనకాపల్లిరూరల్: 101వ సంవత్సరంలో అడుగిడుతున్నాను. నా భార్య రమణమ్మకు 95 ఏళ్లు. ఈ వయసులో కూడా మేమిద్దరం ఉత్సాహంగా ఉంటున్నాం. మేము ఎవరి మీదా ఆధారపడకుండా మా పనులు మేమే చేసుకుంటాం. వేళకు భోజనం చేస్తుంటాను. ఉదయం 8 గంటల సమయంలో ఒక టీ మాత్రమే తాగుతాను. ఉదయం 11 గంటలకు కాయగూరలు, చారుతో కూడిన అన్నం తీసుకుంటాను. సాయితం 6 గంటలకు ఒక టీ మాత్రమే తాగుతాను. రాత్రి పూట భోజనం మానేసి సుమారు 15 ఏళ్లు అవుతుందన్నారు. మాంసాహారం తప్పని సరి కాదు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి పేపర్ చదువుతాను. తహశీల్దారు కార్యాలయానికి నడుచుకుని వెళ్లి అర్జీలు ఇస్తుంటాను. మాకు 8 మంది సంతానం. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు.
-భార్యతో చింతా ధర్మారావు
వ్యాయామంతో చక్కటి ఆరోగ్యం
నర్సీపట్నం: నాకు 90 ఏళ్లు పూర్తయ్యాయి. నేను ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందాను. ఇద్దరు అమ్మాయిలు, కొడుకు ఉన్నారు. ముగ్గురు పిల్లలూ ఉపాధ్యాయులే. చిన్ననాటి నుంచి క్రమం తప్పకుండా వ్యాయమం చేయటంతో పాటు క్రీడల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేవాణ్ని. చిన్న నాటి నుంచి శాకాహారం తీసుకోవడంతో పాటు పరిమిత ఆహారం తీసుకునేవాణ్ని. రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి, గంటపాటు ఇంటి చుట్టూ వాకింగ్ చేస్తాను. సంగీతం వింటాను. వాకింగ్ అనంతరం కళ్ల అద్దాల అవసరసరమే లేకుండా దినపత్రికలు చదువుతాను.
-కొర్తి సత్యనారాయణ మూర్తి, విశ్రాంత ఉపాధ్యాయుడు