=సంస్థాగత విచారణలో 31 మందిపై క్రిమినల్ కేసు
=మిగిలినవారిపై కొనసాగుతున్న సీఐడీ విచారణ
=చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ వెనుకంజ
సాక్షి, విశాఖపట్నం : తప్పుడు ధ్రువపత్రాలతో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ వెనుకంజ వేస్తోంది. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో స్థానికంగా అధికారులేం చేయలేకపోతున్నారన్న ఆక్షేపణలున్నాయి. రోజురోజుకూ నకిలీ టీచర్ల జాబితా కూడా కుదించుకుపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జాబితా 215.. క్రిమినల్ కేసులు 31
2009లో జిల్లా విద్యాశాఖ పదోన్నతులు నిర్వహించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ/సంస్థల గుర్తింపు లేని రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల నుంచి పొందిన డిగ్రీ/పీజీ పట్టాలతో కొందరు పదోన్నతులు పొందారన్న ఆరోపణలున్నాయి. ఇదే అనుమానంతో పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల అర్హతా డిగ్రీలను నిర్ధారణ కోసం ఆయా విశ్వవిద్యాలయాలకు పంపించారు. ఇలా పంపిన వాటిలో 215 మంది జాబితాను విద్యాశాఖ గతంలోనే సిద్ధం చేశారు. ఇది జరిగి సుమారు నాలుగేళ్లవుతోంది. వీరిలో ఇద్దరు ఇప్పటికే పదవీ విరమణ పొందారు.
మిగిలినవారి జాబితాను సీఐడీ అధికారులకు విద్యాశాఖ అందించింది. వారి పదోన్నత అర్హతల ఆధారంగా 14 అంశాల ప్రాతిపదికగా వీరు విచారణకు శ్రీకారం చుట్టారు. అందరి సేవా పుస్తకాలు(ఎస్‌ఆర్)ను పరిశీలించారు. ఇవే అంశాల ఆధారంగా జిల్లా విద్యాశాఖ నుంచి కూడా సమాచారం సేకరించారు. వ్యక్తిగత చార్జిమెమోలు కూడా జారీ చేశారు. కానీ విద్యాశాఖ చేపట్టిన శాఖాపరమైన విచారణలో 31 మందిని నకిలీలుగా నిర్ధారించి తాజాగా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.
చర్యలకు వెనుకడుగు
నాలుగేళ్లుగా నానుతున్న ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. దీని వెనుక పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కొందరు ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణలున్నాయి. మరోవైపు కొందరు సంఘనేతలు కూడా వీరిని వెనకేసుకొచ్చి భారీ స్థాయిలో ముడుపులు వసూలు చేసినట్టు సమచారం. తాజాగా రాష్ట్రంలో సుమారు 1900 మంది ఉపాధ్యాయులపై చర్యలకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమయింది. ఇందులో జిల్లాకు చెందిన 31 మంది ఉపాధ్యాయులున్నారు. మిగిలినవారిపై ఇంకా సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ విచారణ పూర్తి చేసి తుది నివేదిక రానీయకుండా కూడా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
నకిలీ గురువులపై చర్యల విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. శాఖాపరమైన విచారణ చేపట్టి పాఠశాల విద్యాశాఖకు నివేదిక పంపించినట్టు తెలిపారు. తమ విచారణలో 31 మందికి చెందిన సర్టిఫికెట్లు నకిలీవిగా నిర్ధారించినట్టు వెల్లడించారు. ఈ మేరకు రాజధానిలోనే వీరిపై ఉన్నతాధికారులు కేసులు ఫైల్ చేసినట్టు తెలిపారు.