ఈ- పాస్‌తో అక్రమాలకు చెక్
జిల్లాలో 2,930
చౌక దుకాణాల్లో అమలు
నెలసరి 550 టన్నుల మిగులు
అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ పాస్ విధానం అమలు చేయడంతో చౌక దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. గతంలో జిల్లాలో ప్రతినెలా 400 నుంచి 500 టన్నుల సబ్సిడీ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరిలేది. ప్రస్తుతం నూతన విధానం వల్ల ఆ మేరకు బియ్యం మిగులుతోంది.
ఆన్‌లైన్‌తో కట్టుదిట్టం..
గతంలో చౌక దుకాణాలకు సరఫరా అయిన బియ్యం వంద శాతం పంపిణీ చేసినట్లు డీలర్లు తప్పుడు లెక్కలు చూపించేవారు. బోగస్ కార్డులు, గ్రామాల్లో లేనివారి కార్డులకు బియ్యాన్ని పంపిణీ చేసినట్లు లెక్కల చూపి స్వాహా చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పంపిణీ చేసిన బియ్యం వివరాలు ఈ-పాస్ యంత్రంలో నమోదవుతాయి. ఆ లెక్కలు నేరుగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతాయి. పంపిణీ చేయని బియ్యం లెక్క రికార్డు అవుతుంది. ఆన్‌లైన్‌లో మిగులు బియ్యం నమోదును గుర్తించి మరుసటి నెల కోటాలో ఆ మొత్తం తగ్గించి బియ్యం సరఫరా చేస్తారు. డీలర్ ఎలాంటి అవకతవకలకు పాల్పడే వీలుండదు.
32 షాపులకు ‘ఈ- పాస్’ లేదు
జిల్లాలో 2962 చౌకదుకాణాలు ఉండగా ప్రస్తుతం 2930 దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలవుతోంది. 32 దుకాణాలకు ఈ యంత్రాలు ఇంకా అందాల్సి ఉంది. ఇక జిల్లావ్యాప్తంగా ఏడు చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలకు సిగ్నల్ సమస్య ఉంది. దీన్ని కూడా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మరింత పటిష్టం చేస్తాం
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పాస్ విధానాన్ని మరింత పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకున్నాం. డీలర్లు సక్రమంగా యంత్రాలను ఉపయోగించకపోవడంతో అవి పాడవుతున్నాయి. యంత్రాలను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లకు అవగాహన కల్పించి, వారి ద్వారా వీఏఓ, వీఆర్‌ఓ, ఆర్‌ఐ, సీఎస్‌డీటీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. వీరు మాస్టర్ ట్రైనీలుగా వారి పరిధిలోని డీలర్లకు ఈ నెల 23 నుంచి శిక్షణ ఇస్తున్నారు. - బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్