ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులతో ఆడుకుంటోంది. పేరుకు రేషన్‌కార్డులు ఇచ్చినా వాటికి సకాలంలో నిత్యావసర సరుకులు సరఫరా చేయడం లేదు. ఒకవేళ సరఫరా చేసినా ఎక్కువ మంది డీలర్లు వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. డీలర్లు నిర్ణీత వేళలు పాటించాలని ఆదేశాలున్నా..ఎక్కడా అమలు కావడం లేదు. దుకాణాల ముందు బోర్డులతో పాటు ధరల పట్టికలు విధిగా ఏర్పాటు చేయాలన్న నిబంధనలూ తుంగలో తొక్కారు. కొన్ని సమయాల్లో దుకాణాలకు తక్కువ సరుకులు కేటాయించినప్పుడు ఆ డీలర్ల పంట పండుతోంది. సరుకులు తక్కువగా విడుదల చేశారని చెప్పి కొంత వరకు సరఫరా చేసి మిగతావి పక్కదారి పట్టిస్తున్నారు. కిలో రూపాయి బియ్యం గురించి చెప్పనవసరం లేదు.
ప్రభుత్వం సరఫరా చేసే ఈ బియ్యం నాసిరకంగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఆ బియ్యాన్ని ఆహారంగా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువ. దీనిని కూడా కొంతమంది డీలర్లు చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 2107 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 563 తెల్లకార్డులు, 52 వేల 152 అంత్యోదయ అన్నయోజన కార్డులు, 1032 అన్నపూర్ణ కార్డులు, 56 వేల 946 రచ్చబండ-3 కార్డులు ఉన్నాయి. 9 లక్షల 10 వేల 693 కార్డులకు 10089.343 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం, 1825.355 మెట్రిక్ టన్నుల అన్నపూర్ణ అంత్యోదయ యోజన కింద బియ్యం, 10.340 మెట్రిక్ టన్నులు అన్నపూర్ణ కార్డులకు సంబంధించి బియ్యం కేటాయింపులు జరుగుతుంటాయి.
గత ఏడాది మార్చి వరకు పంచదార 426.329 టన్నులు, గోధుమలు 60 వేల టన్నులు, పామాయిల్ నూనె 8 లక్షల 53 వేల 52 లీటర్ల మేర విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి అమ్మహస్తం పథకాన్ని అమలు చేయడంతో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను *185కు విక్రయించేలా రూపకల్పన చేశారు. అయితే అమ్మహస్తంలో అందించే సరుకుల్లో నాణ్యత లోపించడంతో ఎక్కువ మంది రెండు మూడు సరుకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన ఆరు వస్తువులను తీసుకునేందుకు వెనుకాడటంతో డీలర్లు కూడా వాటికి సంబంధించి డీడీలు కట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అధికారులు మాత్రం అమ్మహస్తంకు సంబంధించిన అన్నిరకాల వస్తువులకు డీడీలు కట్టాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న చౌకధరల దుకాణాలపై శుక్రవారం నిర్వహించిన ‘సమరసాక్షి’ లో కార్డుదారుల కష్టాలు వెలుగు చూశాయి. బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు ఒకేసారి సరఫరా చేయాల్సి ఉండగా, గోడౌన్ల నుంచి సకాలంలో రాకపోవడంతో ఒకేసారి ఇవ్వడం లేదు.
ఒంగోలులో వేళలు లేవు...
ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని చౌకధరల దుకాణాల డీలర్లు వేళలు పాటించడం లేదు. ప్రస్తుతం దుకాణాలకు బియ్యం సరఫరా చేసినప్పటికీ, అమ్మహస్తం సరుకులు రాకపోవడంతో బియ్యం నిల్వలు అలాగే ఉంటున్నాయి. ఒంగోలు నగరంతోపాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
కందుకూరు బియ్యం నెల్లూరుకు...
కందుకూరు నియోజకవర్గ పరిధిలోని రేషన్ బియ్యం యథేచ్ఛగా నెల్లూరు తరలుతోంది. ఇటీవల కాలంలో గుడ్లూరు వద్ద రెండుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే ఎక్కువ భాగం నెల్లూరుకు వెళుతోంది. అక్కడ నుంచి రీ సైక్లింగ్ చేసి ఆ బియ్యాన్నే బయట మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. అమ్మహస్తం సరుకులకు కొరత ఉండటంతో డీడీలు తీసేందుకు డీలర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
సంతనూతలపాడులో బినామీలే ఎక్కువ..
సంతనూతలపాడు నియోజకవర్గంలో బినామీ డీలర్లే ఎక్కువగాా ఉన్నారు. ఒకే వ్యక్తి మూడు నాలుగు దుకాణాలు నిర్వహిస్తుండటంతో వేళలు పాటించడం లేదు. నిత్యావసర సరుకుల కోసం కార్డులు తీసుకొని అక్కడకు వెళితే తాళాలు వేసే ఉంటాయి. పెపైచ్చు కొన్ని దుకాణాలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కొంతమంది పనులు మానుకొని నిత్యావసర సరుకులు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది.
కొండపిలో బియ్యం దొడ్డిదారిన...
కొండపి నియోజకవర్గంలో బియ్యం దొడ్డిదారిన వెళుతోంది. వాటి గురించి సమాచారం అందినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మొక్కుబడి దాడులు కూడా చేయడం లేదు. బియ్యం నిల్వలున్నా స్టాక్ తక్కువగా వచ్చిందన్న సాకును చూపించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. సమయ పాలనకు ఎక్కువ మంది డీలర్లు తిలోదకాలిస్తున్నారు.
యర్రగొండపాలెంలో మూడురోజులు దాటితే ఒట్టు..
యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని చౌకధరల దుకాణాలు మూడురోజులకు మించి తెరవడం లేదు. బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు పూర్తి స్థాయిలో వచ్చినా ఎక్కువ మంది డీలర్లు మూడు రోజులే గడువుగా పెట్టుకుంటున్నారు. మూడు రోజులు దాటిన తరువాత ఎవరైనా కార్డుదారులు వెళితే నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇదేమని అడిగితే తమకు తక్కువ కేటాయింపులు వచ్చాయని తాపీగా సమాధానం చెబుతున్నారు.
అద్దంకిలో అమ్మహస్తం లేదు
అద్దంకి నియోజకవర్గంలో అమ్మహస్తం సరుకుల్లో కీలకమైనవి రెండు నెలల నుంచి లేవు. చింతపండు, కారం, గోధుమలకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని అందుబాటులో ఉంచలేదు. చింతపండులో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ మంది దానిని పడవేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా బియ్యం పక్కదారి పడుతోంది.
దర్శిలో దయనీయం...
దర్శి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో బియ్యం, అమ్మహస్తం సరుకులు వచ్చినప్పటికీ ఎక్కువ మంది డీలర్లు వాటిని కార్డుదారులకు అందించడం లేదు. పెపైచ్చు కొంతమంది డీలర్లు స్టాక్ రాలేదంటూ చెబుతున్నారు. దాంతో వాటి పరిధిలోని కార్డుదారులు దుకాణాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నియోజకవర్గ పరిధిలో ఇన్‌చార్జి డీలర్లు ఎక్కువగా ఉండటంతో కొన్నింటికి వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి.
పర్చూరులో పట్టుతప్పిన కేంద్రాలు
పర్చూరు నియోజకవర్గంలో చౌకధరల దుకాణాలు పట్టు తప్పుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో దుకాణదారులు కార్డుదారులకు అందుబాటులో ఉండటం లేదు. దాంతో నిత్యావసర సరుకుల కోసం దుకాణాల చుట్టూ కార్డుదారులు తిరుగుతూ ఉన్నారు. స్టాక్ వివరాలను నోటీసు బోర్డులో ఉంచడం లేదు. దాంతో కొంతమంది దుకాణాలకు రావడమే మానేశారు. ఇది అనేక మంది డీలర్లకు వరంగా మారింది. కార్డుదారులు రాకపోయినా వచ్చినట్లు చూపించి దానిని సొమ్ము చేసుకుంటున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు చీరాల బియ్యం..
చీరాల నియోజకవర్గంలో చౌకధరల దుకాణాలకు సంబంధించిన బియ్యం టూ వీలర్ల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. గతంలో ట్రాక్టర్లు, ఆ తరువాత ఆటోల్లో వాటిని తరలిస్తూ ఉండేవారు. అడపా దడపా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి వాటిని పట్టుకున్నారు. దీంతో అక్రమార్కులు బియ్యం తరలించేందుకు టూ వీలర్లను ఎన్నుకొన్నారు. ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా కర్లపాలెంకు బియ్యం తరలిపోతున్నాయనేది బహిరంగ రహస్యమే.
మార్కాపురంలో వెతుకులాటే..
మార్కాపురంలో నిత్యావసర సరుకులు బ్లాక్‌ల వారీగా విక్రయించాల్సి ఉంటుంది. ఒక్కో నెల ఒక్కో బ్లాక్‌లో డీలర్లు విక్రయిస్తుండటంతో వాటిని కనుగొనడం కార్డుదారులకు కష్టంగా మారుతోంది. ఇదేమని అడిగితే వారి నుంచి సమాధానం ఉండటం లేదు.
గిద్దలూరులో అధిక ధరలు
గిద్దలూరు నియోజకవర్గంలో నిత్యావసర సరుకులను కొంతమంది డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇదేమని అడిగితే తామింతేనంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. గిద్దలూరు పట్టణంలోని కొన్ని దుకాణాల్లో పంచదార కేజీ *14కు విక్రయించాల్సి ఉండగా అదనంగా రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. పంచదారకు డిమాం డ్ ఎక్కువగా ఉండటంతో కార్డుదారులు వారు చెప్పిన ధరకు కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు.
కనిగిరిలో నెలల తరబడి ఎదురుచూపులే..
కనిగిరి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కార్డుదారులు నిత్యావసర సరుకుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అమ్మహస్తం పథకానికి సంబంధించి చింతపండు, గోధుమలు, ఉప్పు నాలుగు నెలల నుంచి అందడం లేదు. పామాయిల్ రెండు నెలల నుంచి అందించడం లేదు. దుకాణదారులు సమయపాలన పాటించకపోవడంతో ఎక్కువ మంది కార్డుదారులు వాటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ప‘రేషన్’
Published Sat, Jan 4 2014 1:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement