సాక్షి, హన్మకొండ: ఉల్లిగడ్డ ధర... సామాన్యులను కన్నీరు పెట్టిస్తోంది. నెలనెలకూ ధర రెట్టింపు వేగంతో పెరుగుతోంది. ఆగస్టులో కిలో ఉల్లిగడ్డలు రూ. 50 పలకగా... ప్రస్తుతం రూ. 60కి చేరుకుంది. కొత్త ఉల్లిగడ్డలు మార్కెట్‌లోకి వచ్చిన ప్పటికీ... పాత వాటి ధర తగ్గకపోవడంతోపాటు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సామాన్యులకు ఉల్లిగడ్డ తెప్పిస్తున్న కన్నీళ్ల నుంచి ఊరట కలిగించేందుకు పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు మూన్నాళ్ల ముచ్చటగా మారారుు. దీంతో పేదలకు ఉల్లిగడ్డలు అందని ద్రాక్షగా మారారుు.
నాలుగింతలు పెరిగింది...
ఈ ఏడాది ప్రారంభంలో కిలో ఉల్లిగడ్డ ధర రూ. 15గా ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో రూ. 23కు పెరిగింది. అప్పటి నుంచి అప్రతిహతంగా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మార్చి నుంచి జూన్ వరకు రూ. 30 నుంచి రూ. 35 మధ్య ఉంది. అయితే కర్నూలులో దిగుబడి ఆలస్యం కావడంతో ఆగస్టులో కిలో ఉల్లిగడ్డ ధర రూ. 50కి చేరుకుంది. సెప్టెంబర్ కల్లా ఖరీఫ్ దిగుబడి వస్తే ఉల్లిధర తగ్గుముఖం పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ... వాటిని తల్లకిందులు చేస్తూ ఈ నెల మధ్య కల్లా ఉల్లిధర మరింత పెరిగి రూ. 60కి ఎగబాకింది.
మరికొంత కాలం ఇంతే...
జిల్లా మార్కెట్‌కు అవసరమైన ఉల్లిగడ్డలు సీజన్ల వారీగా మన రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, షోలాపూర్, యావత్మల్ జిల్లాలకు చెందిన మార్కెట్ల నుంచి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పెద్ద ఉల్లిగడ్డలు యావత్మాల్ నుంచి దిగుమతి చేసుకోగా... కర్నూలు పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వచ్చింది. కానీ, ఈ ఉల్లిగడ్డలు మరీ చిన్నవిగా ఉండడంతో మార్కెట్‌లో ఉల్లిగడ్డల లోటు పూడలేదు. దీంతో పాత ఉల్లిగడ్డలకు డిమాండ్ మరింత పెరగడం ధరపై ప్రభావం చూపింది. దీపావళి తర్వాత షోలాపూర్ నుంచి జిల్లాకు ఉల్లిగడ్డ దిగుమతయ్యే అవకాశముంది. అప్పటివరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
కిలో 60
Published Fri, Sep 20 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement