అనంతపుర సిటీ, న్యూస్‌లైన్: ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన భూమిక పోషిస్తున్నాయని.. వాటి ప్రభావం తగ్గించి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటే ఎన్నికల నిర్వహణలో సమగ్ర సంస్కరణలను తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకూ నిర్వహించిన అనేక ఎన్నికల్లో డబ్బు, కులం ప్రధానంగా మారాయన్నారు.
ఓటర్లకు డబ్బు ఎర చూపి నేరచరితులు సైతం ఎన్నికల్లో పోటీ చేస్తుంటే.. కులాన్ని ప్రచారం చేస్తూ మరికొంత మంది అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారన్నారు. ఫలితంగా నిజాయితీ కలిగిన సామాన్య ప్రజలు పోటీకి అనర్హులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ తరుణంలో ఓటరుకు తిరస్కరణ ఆయుధం ఇస్తూ సుప్రీం కోర్డు తీర్పునివ్వడం శుభ పరిణామంగా అభివర్ణించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని 60 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమాలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పరిష్కరించాల్సిన ప్రభుత్వం తెలంగాణ నోట్ రెడీ అయింది.. త్వరలో ప్రకటిస్తామంటూ ప్రకటనలు చేస్తూ.. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందనానరు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేశవరెడ్డి, సీపీఐ కదిరి నియోజకవర్గ కార్యదర్శి వేమయ్య యాదవ్, చేతివృత్తిదారుల సమాఖ్య నాయకులు వేమయ్య, నాగరాజు పాల్గొన్నారు.