
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్, చిత్రంలో జేసీ డిల్లీరావు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి
ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. వెనువెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఇదే విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్ అధికారికంగా ధ్రువీకరిస్తూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదివారం సాయంత్రం మాట్లాడారు. ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అధికారులు అప్రమత్తతో ఉంటూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం ఎంసీసీ కంపెన్‌డీయం, హ్యాండ్‌బుక్, తరచూ అడిగే ప్రశ్నలకు సంబంధించిన పుస్తకాలను ఆయా అధికారుల వాట్సాప్‌లో ఉంచినట్లు తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు ముద్రించి ఇవ్వాలన్నారు. కల్టెరేట్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఎన్‌ఐసీ నుంచి ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఎన్నికల విధుల్లో భాగమైన ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన్ :ఇకపై ప్రతి అధికారికీ ఎన్నికల పనులు తప్ప ఇతర పనులు ఉండవని జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్ స్పష్టం చేశారు. ఇదివరకే ఎన్నికల్లో పాల్గొన్న అధికారులకు ఎన్నికల కోడ్‌పై అవగాహన ఉన్న దృష్ట్యా.. అవసరమయ్యే అదనపు సిబ్బంది నియామకం, సామగ్రి కొనుగోలు, తదితర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఫారం–7 దరఖాస్తులు పరిశీలించండి
ఓటు తొలగింపు, అభ్యంతరాలకు సంబంధించి ఫారం–7 ద్వారా అందించిన 12,872 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వీరపాండియన్ తెలిపారు. వాటన్నింటినీ ఆదివారం సాయంత్రంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వారి పరిధిలోని అధికారులపై పరిపాలనపరమైన అధికారాలు ఉంటాయన్నారు. కాబట్టి ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన విషయాన్ని పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రకటించాలన్నారు. ఎన్నికల నియమావళి రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులకే పరిమితం కాదన్నారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలూ పాటించేలా చూడాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను మంచి భవనాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌కు నోటిఫై చేసిన తరువాత వాటిని ఎట్టిపరిస్థితుల్లో మార్చేందుకు వీలుండదని తేల్చి చెప్పారు.
అధికార పార్టీపై ప్రత్యేక నిఘా
♦ ఎన్నికల ప్రచారం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా అధికార పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఉంచుతోంది.
♦ ప్రత్యేకంగా మంత్రులు తమ అధికారిక టూర్లను, ఎన్నికల ప్రచారాన్ని కలిపి నిర్వహించకుండా జాగ్రత్తపడాలి.
♦ ఎన్నికల అవసరాలకు పాలనా యంత్రాంగాన్ని, సిబ్బందిని ఉపయోగించరాదు.
♦ అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాల కోసం విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రవాణా సౌకర్యాలను వినియోగించరాదు.
♦ ఎన్నికల సభల నిర్వహణకు ఉపయోగించే మైదానాలు, పబ్లిక్ ప్రదేశాలను, హెలీప్యాడ్లను అధికారంలో ఉన్న పార్టీ ఏ షరతులపై ఉపయోగించుకుంటుందో అదే షరతులపై ఇతర పార్టీలు, అభ్యర్థులు ఉపయోగించడానికి అనుమతించాలి.
♦ అధికారంలో ఉన్న పార్టీ, అభ్యర్థులు ప్రభుత్వ వసతి సౌకర్యాలను వినియోగించుకోకూడదు.
♦ వీటిని ప్రచార కార్యాలయాలుగా, పబ్లిక్ మీటింగ్ నిర్వహించే స్థలాలుగా వినియోగించరాదు.
అందరూ ఊహించినట్లుగానే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రకటన జారీ చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్ స్పష్టం చేయడంతో టీడీపీ ప్రభుత్వ ఆర్భాటాలకు తెరపడినట్లైంది. ప్రజలను మభ్యపెట్టేలా ఇకపై సభలు, శంకుస్థాపనలు చేసే అవకాశం లేదు. ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలిస్తే... – అనంతపురం అర్బన్/గుమ్మఘట్ట
సాధారణ ప్రవర్తన
♦ విభేదాలను మరింత పెంచడం...పరస్పర ద్వేషాన్ని కలిగింగేలా...కులాలు, జాతుల మధ్య, మతపరమైన, భాషాపరమైన ఉద్రేకాలను కలిగించే ఏ రకమైన కార్యకలాపాలను నిర్వహించరాదు.
♦ ఇరత రాజకీయ పక్షాలపై విమర్శలు చేసిన పక్షంలో అధికార విధానాలకు, కార్యకలాపాలకు, పాత రికార్డులకు, పనికి సంబంధించిన అంశాలపై మాత్రమే పరిమితమై ఉండాలి.
♦ ఇతర పార్టీల నాయకులు లేదా కార్యకర్తల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయకూడదు.
♦ కులాలు, మతాల పేరిట ప్రచారాలు చేయకూడదు.
♦ ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, దేవాలయాలు, పాఠశాలలు వినియోగించుకోరాదు.
♦ ఓటర్లను బెదిరించడం, ప్రలోబాలకు గురిచేయడం వంటివి చేయకూడదు.
♦ ఓటరు కాని వారు ఓటు వేసే ప్రయత్నం చేస్తే నేరం.
♦ పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు.
♦ పోలింగ్ సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు ఏర్పాటు చేయరాదు.
♦ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించరాదు. ఓటరు ప్రశాంతతకు ఎలాంటి భంగం కలగరాదు.
♦ అనుమతి లేకుండా ఎవరి భూములు, గోడలను ప్రచారానికి వినియోగించరాదు.
♦ ప్రతి వ్యక్తికీ శాంతియుతంగా గృహజీవితాన్ని గడిపే హక్కు ఉంది. వ్యక్తుల అభిప్రాయాలు, కార్యక్రమాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వారి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం, ప్రదర్శనలు నిర్వహించడం, పికెటింగ్ వంటివి చేయకూడదు.
♦ ఇతర పార్టీలు నిర్వహించే ఉరేగింపులు, సమావేశాలను భగ్నం చేయడం, అడ్డంకులు సృష్టించడం వంటివి చేయకూడదు. వేరొక పార్టీ సమావేశంలో మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ప్రశ్నలు వేయడం, తమ పార్టీ కరపత్రాలు పంచకూడదు. ఓ పార్టీ జారీ చేసిన పోస్టర్లను మరో పార్టీ వారు తొలగించరాదు.
సభల నిర్వహణ
♦ పార్టీ లేక అభ్యర్థి స్థానిక పోలీసు అధికారులకు తగినంత సమయం ఉండేలా ముందుగానే సభ నిర్వహించే ప్రదేశం, సమయాన్ని తెలియజేయాలి.
♦ సభ ఏర్పాటు చేసే ప్రదేశంలో ఇప్పటికే నిషిద్ధాత్మాక లేక నిర్భంద ఆదేశాలు అమలులో ఉంటే కచ్చితంగా పాటించాలి. ఆదేశాల నుంచి మినహాయింపు కోరినట్లయితే, దాని కోసం అభ్యర్థన ముందుగానే పంపి అనుమతి పొందాలి.
♦ సభల్లో లౌడ్ స్పీకర్లు వినయోగించడానికి అనుమతి ముందుగానే సంబంధిత అధికారి నుంచి తీసుకోవాలి.
♦ సమావేశాలు భగ్నం చేయడం లేదా మరో విధంగా శాంతికి భంగం కలిగే విధంగా ప్రయత్నించే వ్యక్తులపై తప్పక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
సమర్థులకే తొలి ఓటు
తొలిసారిగా ఓటు హక్కు పొందా. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాలాంటి యువత ఓటు ఎంతో కీలకమని భావిస్తాను. సమర్థవంతమైన నాయకత్వం.. పేదల అభ్యున్నతికి కృషి చేసే వారికే మద్దతు తెలపాలని అనుకున్నా. నా తోటి మిత్రులందరమూ చర్చించుకుని ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుని అందరమూ మా తొలి ఓటు గుర్తిండిపోయేలా మంచి పాలన అందించేవారికే వేయాలని నిర్ణయించుకున్నాం. – ఈ పూజ, కలుగోడు, గుమ్మఘట్ట మండలం
చెల్లింపులపై నిషేధం..
ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించింది. దీంతో మంత్రులు, ఇతర అధికారులు తమ విచక్షణ నిధుల నుంచి ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు మంజూరు చేయకూడదు. నేటి నుంచి మంత్రులు, ఇతర అధికారులు ఏ రూపంలోనూ లేక వాగ్ధానాలు, ఎలాంటి ఆర్థిక గ్రాంట్లను ప్రకటించకూడదు. ప్రాజెక్టులు, పథకాల కోసం శంకుస్థాపనలు నిర్వహించకూడదు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల విషయంలో వాగ్ధానాలు చేయకూడదు. ప్రభుత్వ రంగసంస్థల్లో ఎలాంటి అడ్‌హక్ నియామకాలు చేపట్టకూడదు.
ఊరేగింపులు
♦ ఊరేగింపు నిర్వహించే పార్టీ లేదా అభ్యర్థి కార్యక్రమం ప్రారంభించే సమయం, ప్రదేశం, వెళ్లే మార్గం, ముగింపు సమయం, ప్రదేశం, తదితర విషయాలను ముందుగా తెలియజేయాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించరాదు.
♦ కార్యక్రమం గురించి స్థానిక పోలీసు అధికారులకు నిర్వాహకులు ముందుగానే తెలియజేయాలి. ఉరేగింపు సాగే ప్రదేశాలలో ఏవైనా నిర్భంద ఆదేశాలు అమలులో ఉంటే సంబంధిత అధికారి నుంచి ప్రత్యేక మినహాయింపు పొందాలి. ట్రాఫిక్ నిబంధనలు, నిర్బంధాలను జాగ్రత్తగా అనుసరించాలి.
♦ అడ్డంకులు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉరేగింపు సజావుగా నిర్వహించుకోవాలి. పోలీసుల నిర్దేశాన్ని, సలహాలు పాటించాలి. అభ్యర్థులు లేదా పార్టీలు ఒకే మార్గంలో ఊరేగింపు తలపెట్టినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను సంప్రదించాలి.
♦ ఊరేగింపులో పాల్గొనే వ్యక్తులు నిషేధిత వస్తువులూ వెంట తీసుకురాకుండా రాజకీయ పక్షాలు, అభ్యర్థులదే బాధ్యత.
♦ ఇతర రాజకీయ పక్షాల సభ్యులు లేదా నాయకుల దిష్టిబొమ్మలను మోసుకెళ్లడం, దిష్టిబొమ్మలను తగలబెట్టడం, వ్యతిరేక ప్రదర్శన రూపాలను నిర్వహించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment