నేతల వెన్నులో వణుకు
కేసుల సమాచారం కోరిన ఎన్నికల కమిషన్
పోలీసు శాఖ ముమ్మర కసరత్తు
నియోజకవర్గాల వారీగా బాధ్యతలు
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసు శాఖ రాజకీయ నాయకులపై నమోదైన కేసుల సమాచారాన్ని సేకరిస్తోంది. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధుల పైనున్న కేసుల వివరాలను తెలుసుకునేందుకు పాత ఫైళ్ల దుమ్ముదులుపుతున్నారు. డీజీపీ ప్రసాదరావు మూడు రోజుల క్రితం అన్ని జిల్లాల పోలీసు అధికారులను వివరాల సేకరణపై అప్రమత్తం చేశారు. ఆ మేరకు ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్ అధికారులకు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు పంపిన సమాచారాన్ని పై అధికారులకు పంపగా.. పూర్తి నివేదికను త్వరలో ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించడంతో ఈ ప్రక్రియ ముమ్మరమైంది.
ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులతో పాటు సెల్ టవర్ల సంఖ్య వరకు లోతైన సమాచారం సేకరించి ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఒత్తిడి చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తులపైనా ఆరా తీస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన బదిలీలు ఇప్పటికే 75 శాతం పూర్తయ్యాయి. ఈనెల 25న కట్ ఆఫ్ డేట్ విధించడంతో మిగిలిన బదిలీలు కూడా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదిలాఉండగా నాయకులపై నమోదైన కేసుల వివరాలను ఎన్నికల కమిషన్ సేకరిస్తుండటంతో నాయకుల్లో గుబులు మొదలైంది. బరిలో నిలిచే సమయానికి కేసులపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.
నేతల అనుచరులపైనా నిఘా: నేతల అనుచరులుగా దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ షీటర్ల కదలికలపైనా నిఘా సారించారు. వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎన్నికల సమయంలో వీరు దేనికైనా సిద్ధపడే అవకాశం ఉందని పోలీసు అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈసీ ఆదేశాలతో ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ఎన్నికల నాటికి తలెత్తే పరిస్థితులు, తుపాకీ అనుమతులు ఎవరెవరికి ఉన్నాయనే విషయమై సేకరించిన సమాచారాన్ని పోలీసు వర్గాలు ఈసీకి సమర్పించాయి.
2009లో సాధారణ ఎన్నికలు.. 2012లో జరిగిన ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ఉప ఎన్నికల సందర్భంగా నేతలపై నమోదైన కేసులు
29.04.2012న ఆళ్లగడ్డలో ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై 10.05.2012న కేసు(క్రైం నం.48/12) నమోదైంది. ఆయనతో పాటు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, ఆదోని ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఎన్‌హెచ్.భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితరులపై ఐపీసీ 188, 156క్లాజ్ 3 సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
25.05.2012న ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన నేపథ్యంలో ఆళ్లగడ్డ మండలం దొర్నిపాడు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రసాదరెడ్డి, లింగారెడ్డి, నారాయణరెడ్డితో పాటు మరో 12 మందిపై ఐపీసీ 341, 342, 506 సెక్షన్ల కింద కేసు(క్రైం నం.37/12) నమోదైంది.
వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ ఫిర్యాదు మేరకు అదే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డితో పాటు మరో 11 మందిపై క్రైం నం.114/09 కింద కేసు బనాయించారు. ఇదే స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు క్రైం నం.115/09 కింద కేఈ ప్రభాకర్ సహా మరో పది మందిపై కేసు నమోదైంది.
సాధారణ ఎన్నికల సందర్భంగా జలదుర్గంలో పోలింగ్ బూత్ సమీపంలోకి వెళ్లకూడదనే నిబంధనను ఉల్లంఘించినందుకు డోన్ ఎమ్మెల్యే కేఈ క్రిష్ణమూర్తిపై జలదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు(క్రైం నం.42/09) నమోదైంది.
2009లో కాటసాని రామిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ సందర్భంగా విధులకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు(క్రైం నం.67/09) నమోదైంది.
గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ ముందు రోజు నాయకులతో పాటు వారి అనుచరులపై 49 కేసులు నమోదు కాగా.. పోలింగ్ రోజు 24 కేసులు, పోలింగ్ ముగిసిన మరునాడు 13 కేసులు నమోదయ్యాయి. కోడ్ ఉల్లంఘించిన కేసులు, పోలింగ్‌కు ముందు రోజు 72 కాగా.. పోలింగ్ రోజు 7 కేసులు నమోదయ్యాయి.